ఇసుక అక్రమ రవాణా చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాష
పల్లెవెలుగు, కర్నూలు : ఇసుక అక్రమ రవాణా చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాష తెలిపారు.సోమవారం సాయంకాలం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల ప్రకారం ఉచిత ఇసుక ను సాధారణ ప్రజల గృహ నిర్మాణాల అవసరాలకు అనుమతి ఇవ్వాలని వారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకూడదని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైనా అక్రమంగా ఇసుకను సేకరించుకొని వ్యాపారం చేస్తున్న , సరిహద్దులు దాటిస్తున్న వారి వాహనాలను వెంటనే సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండల , గ్రామ సెక్రటేరియట్ అధికారుల తో ఏర్పాటు చేయబడిన టీంల సహాయంతో మెరుపు దాడులు నిర్వహించి అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. డివిజన్ స్థాయి సమావేశాలను నిర్వహించుకొని ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు ఆర్డీవో లను ఆదేశించారు.నదులు, వాగులు దగ్గర ఉన్న త్రాగునీటి సరఫరా కేంద్ర ప్రాంతాల లో ఇసుక త్రవ్వకాలకు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించరాదని కలెక్టర్ ఆదేశించారు. అటువంటి ప్రదేశాల్లో ఇసుక త్రవ్వకాలు జరుగుతూ ఉంటే వాహనాలను సీజ్ చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య , అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా , డి.ఎస్.పి రవీంద్రబాబు , డిఎస్పి ఉష శ్రీ , డిడి మైన్స్ రవిచంద్ర , ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు , డిటిసి శాంత కుమారి , డిపిఓ భాస్కర్ , ఇరిగేషన్ ఈఈ శైలేశ్వర్, గ్రౌండ్ వాటర్ డిడి శ్రీనివాసరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి , కర్నూలు తాలూకా సిఐ , కోడుమూరు సిఐ, తదితరులు మరియు సబ్ కలెక్టర్ ఆదోని , ఆర్డిఓ లు పత్తికొండ మరియు కర్నూలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.