నవోదయం 2.0 ద్వారా నాటు సారా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు
1 min read
నాటుసారా నివారణకు 14405 టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు
జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్
నంద్యాల, న్యూస్ నేడు: నవోదయం 2.0 ద్వారా జిల్లాలో నాటు సారా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నవోదయం 2.0 కార్యక్రమ పటిష్ట అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, డిఎంహెచ్ఓ వెంకటరమణ, డిఈఓ జనార్ధన్ రెడ్డి, డిఎఫ్ఓ నాగమునేశ్వరి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో నాటు సారా నిర్మూలన కోసం నవోదయం 2.0 అనే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో నాటు సారా నిర్మూలన కోసం ముఖ్యంగా గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజా ప్రతినిధుల ద్వారా నాటు సారా దుష్ప్రభావాలను వివరిస్తూ, కళాజాతాల కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 19 గ్రామాలు ఏ కేటగిరీ, 19 గ్రామాలు బి కేటగిరీ, 91 గ్రామాలు సి కేటగిరీలుగా గుర్తించడం జరిగిందన్నారు. వీరిని నిల్వరించడానికి విఎఓ, విఆర్ఓ, సచివాలయ సిబ్బందితో కమిటీలు ఏర్పాటు చేశామని, సంబంధిత వ్యక్తుల సహకారంతో తనిఖీలు నిర్వహించి నాటు సారా నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. సి కేటగిరీలో ఉన్న 91 గ్రామాల్లో 27 గ్రామాలను, బి కేటగిరీలో ఉన్న 19 గ్రామాల్లో 6 గ్రామాలను, ఏ కేటగిరీలో ఉన్న 19 గ్రామాల్లో 2 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దెందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ ప్రాంతాలలో కూడా నాటు సారా తయారీ నియంత్రణకు ఫారెస్ట్, ఎక్సైజ్ సిబ్బంది సహకారంతో కూడా తనిఖీలు చేయాలన్నారు. నాటుసారా నివారణకు 14405 టోల్ ఫ్రీ నెంబరు కూడా ఏర్పాటు చేసినట్లు డిఆర్ఓ తెలిపారు.ప్రాహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ సారా వంటి నష్టదాయక పదార్థాలపై నిర్దాక్షిణ్యంగా పోరాటం జరగాలని, దీని నిర్మూలనకు ప్రభుత్వ నిష్టతో ప్రారంభించిన “నవోదయ 2.0” కార్యక్రమాన్ని గ్రామా స్థాయికి విస్తరించాలని సూచించారు. మత్తుకు బానిసలైన బాధితుల పునరావాసానికి అవసరమైన మానసిక, వైద్య, మరియు సామాజిక సహాయాలను సమకూర్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, మద్యం నియంత్రణ శాఖ, గ్రామ సచివాలయాలు మరియు స్థానిక స్వయంసేవక సంఘాల సమన్వయం కీలకమని పేర్కొన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు సారా దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా బాధితుల గుర్తింపు మరియు కౌన్సిలింగ్ చేపట్టాలన్నారు. ఎక్సైజ్ శాఖతో సమన్వయం చేసుకొని అక్రమ మద్యం తయారీ, అమ్మకాలను అరికట్టాలన్నారు.