కట్టుదిట్టంగా పదో తరగతి పరీక్షలు
1 min readఏలూరు జిల్లాలో 32,355 మంది విద్యార్థులు, 139 పరీక్షా కేంద్రాలు
ప్రతి ప్రశ్నపత్రానికి ఒక క్యూ ఆర్ కోడ్..
నో మొబైల్ జోన్లుగా పరీక్షా కేంద్రాలు..
ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటు..
కంట్రోల్ రూమ్ నెం. 8121840400..
జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఈనెల 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో వివిధ శాఖల సిబ్బందితో పదో తరగతి పరీక్షలు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూఏలూరు జిల్లాలో 10 వ తరగతి పరీక్షలకు మొత్తం 32,355 మంది హాజరుకానున్నారని, వీరిలో బాలురు 16,760 మంది, బాలికలు 15,595 మంది ఉన్నారని, వీరిలో రెగ్యులర్ విద్యార్థినీ విద్యార్థులు 24,125 మంది అని అలాగే ప్రైవేట్ విద్యార్థిని విద్యార్థులు మొత్తం సంఖ్య 8,230 మంది హాజరవుతున్నట్లు చెప్పారు. జిల్లాలో 139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు పరీక్షలు రోజుమార్చి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులను 8.45కు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. అలాగే పరీక్ష సమయం పూర్తయిన పిదపే బయటకు వదలడం జరుగుతుందన్నారు. ఆలస్యంగా వచ్చిన వారిని కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు నిర్వహించే పదవతరగతి పరీక్షలను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎటువంటి పొరబాట్లు దొర్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.జిల్లాలో 139 పరీక్షా కేంద్రాలను ముందుగానే ఒకసారి తనిఖీ చేయాలని సూచిస్తూ, ఏమైనా లోటుపాట్లు ఉంటే ముందుగానే చక్కదిద్దాలన్నారు. పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అక్రమాలకు చోటులేకుండా ఈసారి ప్రతి ప్రశ్నపత్రానికి ఒక క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాలన్ని నో మొబైల్ జోన్లుగా ప్రకటించడం జరిగిందన్నారు. డిఇఓ సహా ఛీఫ్ సూపరింటెండెంట్ ఇతర అధికారులసైతం పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, పేజర్లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు తీసుకురావడానికి వీలులేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే దానికి బాధ్యులైనవారికి మూడేళ్లవరకు జైలుశిక్ష పడుతుందని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని త్రాగునీటి వసతితోపాటు ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు, బీపీ, షుగర్ చెక్ చేసే పరికరాలు, అత్యవసర మందులతో వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఒకరు అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ చెప్పారు. మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు 6 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని ,స్క్వాడ్స్ ప్రతిరోజూ కేంద్రాలను తనిఖీ చేస్తాయన్నారు అలాగే సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అక్కడ సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారన్నారు. పరీక్షల విధుల్లో ఉన్నవారు మినహా బయటి వ్యక్తులను కేంద్రాల్లోకి అనుమతించరని దివ్యాంగులకు అవసరమైతే స్కైబ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. పరీక్షలకు విద్యార్ధులు సకాలంలో హాజరయ్యేలా ఆర్ టిసి బస్సులు నడపాలని విద్యార్ధులు హాల్ టిక్కెట్ తో ఉచితంగా ప్రయాణించేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్ పి (ఏ ఆర్)ఎన్ ఎస్ ఎస్ శేఖర్,జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహాం, డిఎంహెచ్ వో డాక్టర్ ఎస్ . శర్మిస్ట ఉప రవాణా కమిషనర్ శాంత కుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ముక్కంటి, విద్యుత్ శాఖ ఎస్ ఈ సాల్మన్ రాజు, కలెక్టరేట్ ఏవో కె.కాశీ విశ్వేశ్వరరావు,జిల్లా ప్రజా రవాణా అధికారి వరప్రసాదరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ జి ఏస్.పి.బి. కుమార్,జడ్పీ డిప్యూటీ సీఈవో ఎస్.నిర్మల జ్యోతి,పోస్టల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.