రిలే నిరాహారదీక్షలు జయప్రదం చేయండి-యుటిఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో రేపటి నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు చేపట్టే రిలే నిరాహారదీక్షలను విజయవంతం చేయాలని యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ అధ్యక్షులు కృష్ణా నాయక్ పిలుపునిచ్చారు.మండలంలోని ఏనుగుమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని,పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలు చేస్తున్నామని ఐతే రాష్ట్ర ప్రభుత్వం కేవలం భవిష్య నిధి రుణాలు మాత్రమే చెల్లించడం అన్యాయమని పేర్కొన్నారు.మిగిలిన బకాయిలైన పి ఆర్ సి అరియర్లు,డి ఏ అరియర్లు,సంపాదిత సెలవుల ఎన్ క్యాష్ మెంట్ మొదలైనవి ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు.ఇంకా ఆయన మాట్లాడుతూ 12 వ పి ఆర్ సి విధి విధానాలను రూపొందించాలని,30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు.రిలే నిరాహారదీక్షలలో భాగంగా నంద్యాల పట్టణంలో ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో డోన్ డివిజన్ పరిధిలోని డోన్,ప్యాపిలి,బేతంచర్ల మండలాల నుండి ఎక్కువ సంఖ్యలో యుటిఎఫ్ నాయకులు,కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.ఈ సమావేశంలో ఉపాధ్యాయులు బొజ్జన్న,నాగ మద్దయ్య, సాలయ్య,మారతమ్మ,వాణి బాయి,లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.