జగనన్న కాలనీల అభివృద్ధికి పటిష్ట కార్యాచరణ..
1 min read– విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : జగనన్న కాలనీల అభివృద్ధికి పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు. కొమడవోలు జగనన్న నగర్ లో నూతనంగా నిర్మించిన 33/11 కిలోవాట్ల సామర్థ్యం గల విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదవారి సొంతింటి కలను సాకారం చేసేలా అర్హులైన వారందరికీ ఇంటి స్థలం తో పాటు, ఇళ్ల నిర్మాణానికి 1.80 లక్షల రూపాయలను పూర్తి ఉచితంగా మంజూరు చేశామన్నారు. ఏలూరు నియోజకవర్గ పరిధిలోనే సుమారు 30 వేల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, ఆయా కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణంతో పాటు మంచినీటి సౌకర్యం, విద్యుదీకరణ, రహదారులు, డ్రైనేజీల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేస్తున్నామన్నారు. జగనన్న కాలనీలలో అత్యున్నత జీవన ప్రమాణాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ , విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఎస్ ఇ, డిఈ లు, ఏఈలు, స్థానిక కార్పొరేటర్లు ఆరేపల్లి రాధిక సత్తిబాబు, సుంకర చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.