జాబ్ క్యాలండర్ పై విద్యార్థుల ఆగ్రహం.. అరెస్ట్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో నామమాత్రంగా ఖాళీ పోస్టులు విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏపీపీఎస్సీ ముట్టడికి బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. కడపలో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా ఇంటి ముట్టడికి విద్యార్థులు యత్నం చేశారు. తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నం చేశారు. విజయనగరంలో మంత్రి బొత్స, విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఇళ్లను ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. గుంటూరు, కర్నూలులో ఆందోళనకు దిగిన విద్యార్థులను, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.