విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో శాస్త్రవేత్తలుగా ఎదగాలి
1 min read– జాతీయ సైన్స్ డే సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి.
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా : విద్యార్థులు చిన్ననాటి నుండే శాస్త్రీయ దృక్పథంతో శాస్త్ర వేత్తలుగా ఎదగాలని అన్నమయ్య జిల్లా లోని సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి పేర్కొన్నారు . జాతీయ వైజ్ఞానిక దినోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. చమర్తి హర్షవర్ధన్ రాజు తయారు చేసిన రాకెట్ ఇస్రో తోపాటు పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు పలువురిని అబ్బురపరిచాయి. విద్యార్థినీ విద్యార్థులు వివిధ రంగులతో నేలపై వేసిన సైన్సు బొమ్మలు పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ తో సీవీ రామన్ ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగుర వేసిన రోజు ఫిబ్రవరి 28 తేదీ అన్నారు. అందుకు గుర్తుగా ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత శక్తి వెలుగులోకి వస్తుందన్నారు. విద్యార్థులందరూ చిన్ననాటి నుండే సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. వినూత్న ఆలోచనలతో సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలన్నారు.దేశం అభివృద్ధి చెందాలన్నా, మానవ మనుగడకు సైన్సు ఎంతగానో ఉపయోగ పడుతోందన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించటం విద్యార్థులు అలవాటు చేసుకోవాలన్నారు. ఏ పి జె అబ్దుల్ కలాం, సర్ సి వి రామన్, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తదితర మహోన్నత వ్యక్తులును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైన్సు ఉపాధ్యాయులు రామయ్య, నబీ రసూల్, రామకృష్ణ నాయక్, రవీంద్ర రాజు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.