PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు క్రీడలతో.. ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారు

1 min read

– ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడి.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  విద్యార్థులు చిన్నతనం నుండే క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, ఏకాగ్రత పెరిగి చదువులోనూ రాణించే అవకాశం ఉంటుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు .కర్నూల్ నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో తైక్వాండో సీనియర్ శిక్షకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తై క్వాండో ప్రదర్శన కార్యక్రమాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ చిన్నారి క్రీడాకారులకు రోజు స్వచ్ఛమైన మంచినీరు తాగేందుకు వీలుగా వాటర్ బాటిళ్ల ను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కరాటే విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో , చదువులో రాణించాలంటే మెరుగైన ఆరోగ్యం ఉండాలని సూచించారు. ఇందులో భాగంగా విద్యార్థులు బయట  ఆహార పదార్థాలను తినకుండా ఇంటిలో చేసిన ఆహార పదార్థాలను మాత్రమే తినాలని సూచించారు. అలాగే కలుషితమైన నీరు తాగడం వల్ల  కలరా, గ్యాస్ట్రోఎంట్రైటీస్, డయేరియా, టైఫాయిడ్ ,హెపటైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సూచించారు. విద్యార్థులు ఇంటి నుండి స్వచ్ఛమైన మంచినీరు తీసుకునేందుకు వీలుగా వాటర్ బాటిల్లను అందజేసినట్లు వివరించారు. విద్యార్థులు థైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుందని, యోగ, ప్రాణాయామం, ధ్యానం వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే ఎక్సర్సైజులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం విద్యార్థులు చిన్నతనం నుండే సెల్ ఫోన్ లను అతిగా వినియోగించడం వల్ల ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారని వివరించారు. అలా కాకుండా క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్య మెరుగుపడి చదువులో రాణిస్తారని చెప్పారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల కులాలు, మతాలు, ప్రాంతాలు అన్న భావాలు ఉండమని అందరూ స్నేహభావంతో మెలిగి క్రీడాస్పూర్తిని ప్రదర్శిస్తారని చెప్పారు. దేశ భవిష్యత్తు నేటి చిన్నారుల చేతుల్లోనే ఉందని ,వారు క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులు చిన్నతనం నుంచే తామంతా భారతీయులం అన్న జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. విద్యార్థులు పార్కుల్లో క్రీడలను సాధన చేయడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు   ఆక్సిజన్ ను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం చాలామంది చిన్న చిన్న విషయాలకే నిరాశ నిష్ప్రహలకు లోని ఆత్మహత్యలు చేసుకునే లాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, క్రీడల్లో పాల్గొనడం వల్ల అలాంటి ఆలోచనలు రాకుండా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవచ్చు అని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అభిప్రాయపడ్డారు .ఈ కార్యక్రమంలో సీనియర్ తైక్వాండో కోచ్ వెంకటేశ్వర్లు తో పాటు రోహిత్, నాగరాజు, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.

About Author