పి-4 సర్వేను విజయవంతంగా నిర్వహించండి
1 min read
పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
జిల్లాలో 8వ తేదీ నుంచి పి-4 సర్వే
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో ఈనెల 8నుంచి చేపట్టే పి-4 సర్వేను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో పి-4 సర్వే, ఎంఎస్ఎంఇ సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేపై ఎంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మండల సచివాలయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పి-4 సర్వే నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్, ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్(పి-4) సర్వే కు కార్యాచరణ రూపొందించిందన్నారు. జిల్లాలో ఈనెల 8వ తేదీ నుండి గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించి ఈనెల 16వ తేదీ నాటికి పూర్తిచేయాలన్నారు. అనంతరం ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించాలన్నారు. ఈరోజు ఇక్కడ అందించిన శిక్షణ కార్యక్రమ వివరాలను ఎంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు తమ పరిధిలోని గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందికి పూర్తిస్ధాయిలో అవగాహన కల్పించాలన్నారు. పేదరికాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా చేపడుతున్న కార్యక్రమాలకు అధనంగా సామాజికంగా, ఆర్ధికంగా ఉన్నతస్ధాయిలో ఉన్న కుటుంబాలు తమ సామాజిక బాధ్యతగా అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలిచేలా పి-4 విధానం ముఖ్య ఉధ్యేశమని వివరించారు. పేదల అవసరాలను గుర్తించి వారి సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్ట్ రూపకల్పనకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం కుటుంబాలు అందుకుంటున్న పధకాలపై ఈ సర్వే ఏలాంటి ప్రభావం చూపబోదన్నారు. సర్వేద్వారా సేకరించిన డేటా ఆధారంగా కుటుంబ అవసరాలకు అనుగుణంగా సమర్ధవంతమైన ప్రణాళికలు రూపొందించవచ్చన్నారు. యాప్ లో పొందుపర్చిన 27 ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించాల్సివుంటుందన్నారు. ఆయా కుటుంబాలకు ఏమైనా అపోహలు ఉంటే వాటిని తొలగించి సర్వేను ఈనెల 16వ తేదీ నాటికి విజయవంతంగా పూర్తిచేయాలన్నారు. ఎంఎస్ఎంఇ సర్వేను రానున్న 24 గంటల్లో ముగింపుచేయాలన్నారు. ఇప్పటికే 84 శాతం పూర్తిచేశారని, మిగిలిన దానిని వెంటనే పూర్తిచేయాలన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కు సంబంధించిన వివరాలను వెంటనే సేకరించాలని ఆదేశించారు. సచివాలయాల పరిధిలో నిర్ధేశించిన పలు అంశాల్లో ఉత్తమ ప్రగతి కనబర్చిన ఎంపిడివోలను ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, సిపివో వాసుదేవరావు పి-4 సర్వే నిర్వహణ తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారులు ఉధ్యాన శాఖ డిడి ఎస్. రామ్మోహన్, డిసివో శ్రీనివాస్, డిఎస్ఓ వై. ప్రతాప్ రెడ్డి, ఎంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.
