అలాంటి వారు రేషన్ కార్డులు వెనక్కి ఇచ్చేయాల్సిందే !
1 min readపల్లెవెలుగువెబ్ : రేషన్‌కార్డులకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలను తెచ్చింది. రేషన్ కార్డులకు ఎవరు అర్హులో.. ఎవరో కాదో.. చెబుతూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హత లేని వారు ఎవరైనా రేషన్ కార్డులు కలిగి ఉంటే వెంటనే సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకవేళ అనర్హులు కార్డులను సరెండర్ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు ఆదాయం ఉన్న వారు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారే కార్డులకు అర్హులని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలలోపు , పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు ఆదాయం వచ్చేవారికే రేషన్ కార్డు వస్తుంది. మాగాణి భూములు 3.5 ఎకరాల్లోపు ఉన్నవారు, బీడు భూములైతే 7.5 ఎకరాల్లోపు ఉన్నవారు రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులు. వంద చదరపు మీటర్ల ఇల్లు, ఫ్లాట్ ఉన్నవారు, కారు, ట్రాక్టర్‌లు కలిగిన వారు, గ్రామాల్లో రూ.1.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే కార్డులు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో సరెండర్ చేయాల్సి ఉంటుంది.