మూఢ నమ్మకాలు విడనాడాలి – డిప్యూటీ తహసీల్దార్
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: విద్యార్థులు చిన్నతనం నుండే శాస్త్రీయ విజ్ఞానం,శాస్త్రీయ దృక్పథం పైన అవగాహన కలిగిఉండాలని అప్పుడు మాత్రమే సమాజంలో ఉండే సామాజిక దురాచారాలు,మూఢ నమ్మకాలను శాశ్వతంగా రూపుమాపవచ్చని ప్యాపిలి మండల డిప్యూటీ తహసీల్దార్ మారుతి పేర్కొన్నారు.జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాల సందర్భంగా ప్యాపిలి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక డోన్ డివిజన్ అధ్యక్షులు సర్వజ్ఞ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు చెకుముకి టెస్ట్ ప్రశ్నాపత్రాలు ప్యాపిలి మండల విద్యాశాఖాధికారి రామకృష్ణయ్య,వెంకటేశ్వర నాయక్,జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మా బాయి,యుటిఎఫ్ నాయకులు శాంతి ప్రియ,జే వి వి నాయకులు అబ్దుల్ లతీఫ్,సర్వజ్ఞ మూర్తి,యుటిఎఫ్ నాయకులు నరసింహారెడ్డి,హరి నారాయణ తదితరులు విడుదల చేశారు.ఈ సందర్భంగా మారుతి గారు మాట్లాడుతూ విద్యార్థులలో సైన్స్ పైన అవగాహన పెంచడానికి ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం పరీక్షల్లో మొదటి స్థానం పొందిన ప్యాపిలి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు,ద్వితీయ స్థానం పొందిన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు,తృతీయ స్థానం పొందిన హుసేనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జ్ఞాపికలు మరియు సర్టిఫికెట్ అందచేయటం జరిగింది. అబ్దుల్ లతీఫ్ మాట్లాడుతూ మండల స్థాయిలో ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు జనవరి 7 వ తేదీన నంద్యాలలో జరిగే జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ కి హాజరు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి,కృష్ణా నాయక్,సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.