కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లా రైతాంగాన్ని ఆదుకోండి
1 min readజిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరత్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలో తీవ్ర వర్షాభావ కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగాన్ని అన్ని రకాల ఆదుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ గారితో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్క్ ఫెడ్ చైర్మన్ పి.పి.నాగి రెడ్డి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు రాజమోహన్ రెడ్డి, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆరు మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతుల వేసిన పంటకు ఈ క్రాప్ బుకింగ్ తో పాటు పెండింగ్ లో ఉన్న ఈ కేవైసీని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం అనుమతించిందని నర్సరీల్లో సంబంధిత ప్లాంటేషన్ కు చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారిని ఆదేశించారు. సాగునీటి కాలువలు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పరివాహక ప్రాంతాలోని రైతులకు నీటి సౌకర్యం కల్పించి వేసుకున్న పంటలను కాపాడేందుకు ప్రయత్నించాలని సంబంధిత అధికారులను కోరారు. ఇన్పుట్ సబ్సిడీ ప్రీమియంపై రైతుల్లో ఆందోళన ఉందని ఈ అంశంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించినప్పటికీ తీవ్ర నిర్లక్ష్యం చేశారని చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు అలసత్వాన్ని విడనాడి రైతుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకుని చురుకుగా పనిచేసి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ రబీలో సాగు చేసుకున రైతులకు కరువు పరిస్థితులపై వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, మండల వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే జొన్న పంట కొనుగోలు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అర్బీకే లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరు ఎలా వుందని సంబధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ కింద ఈ సంవత్సరం ఖరీఫ్ కు 9 రకాల పంటలు మరియు రబీకు 6 రకాల పంటలకు వున్నాయని ఆర్బీకే ల ద్వారా గ్రామ సభలు నిర్వహించి రైతులకు అర్థమయ్యేలా ఏఏ పంటలకు ఎంత ఇన్సూరెన్స్ వస్తుందనే అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమయ్యే విత్తనాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఏపీ సీడ్స్, మార్క్ఫెడ్ అధికారులను సూచించారు. రైతులకు అవసరమయ్యే సూచనలు సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ ఏడీఏలు, గ్రామ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, మార్కెటింగ్, మార్క్ఫెడ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.