అమరావతి భూములపై సుప్రీంలో విచారణ
1 min readపల్లెవెలుగు వెబ్ : రాజధాని అమరావతి భూములపై ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని గతంలో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. తమకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు, ఆలోచనలు వినకుండా ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిందని, తాము లేవనెత్తిన ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకోనందున పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ద్విసభ్య ధర్మాసనం .. రాష్ట్ర హైకోర్టు అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్నాక తీర్పు ఇచ్చినట్టు తాము గమనించామని పేర్కొంది. ఈ అంశంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు తమకు కూడ కనిపించడంలేదంటూ దుష్యంత్ దవే వాదనలతో విభేధించింది. అనంతరం కేసును 19వ తేదికి వాయిదా వేసింది.