సర్వేలు పకడ్బందీగా నిర్వహించాలి…
1 min read
సచివాలయాల్లో సమగ్ర సమాచారం ఉండాలి
నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడు
కర్నూలు , న్యూస్ నేడు: నగరంలో పీ4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్షిప్), వర్క్ ఫ్రం హోం సర్వేలను పకడ్బందీగా నిర్వహించాలని నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడు సచివాలయాల సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన 115 (రామలింగేశ్వర్ నగర్, 117(కప్పల్ నగర్), 120వ (అశోక్ నగర్-2) సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. హాజరు, సెలవు, మూవ్మెంట్ రిజిస్టర్లను పరిశీలించిన మేనేజర్, వాటి నమోదు సక్రమంగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పనివేళల్లో సిబ్బంది ప్రజలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం పనికి రాదన్నారు. అనంతరం సర్వేలు చేపడుతున్న తీరు, పన్ను వసూళ్ల పురోగతిపై ఆరా తీశారు. సచివాలయ పరిధిలో గృహాలు, వాణిజ్య దుకాణాలు, పన్ను డిమాండ్ వంటి సమగ్ర సమాచారం అందుబాటులో ఉండాలని, వాటి ఆధారంగా సచివాలయ పరిధిలోని స్థితిగతులను అంచనా వేయవచ్చన్నారు. పేదరిక నిర్మూలనకు సంబంధించి ‘పీ4’, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించుటకు సంబంధించి ’వర్క్ ఫ్రం హోం’ సర్వేలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, వాటిని సచివాలయ సిబ్బంది పక్కా పకడ్బందీగా ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సచివాలయ సిబ్బంది తమ పనితీరును మెరుగుపరచుకోవాలని హితవు పలికారు. మేనేజర్‌తో పాటు సూపరింటెండెంట్ రామక్రిష్ణ, రాఘవేంద్ర ఉన్నారు.