టీ మంత్రులది…. మతిలేని వాదన..!
1 min read– పోతిరెడ్డిపాడుపై అభ్యంతరాలా..?
– సీమపై యుద్ధమా…?… రాయలసీమవాసులు భయపడరు..!
– మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ ఉత్పత్తి కోసమేనంటూ…. జల చౌర్యంకు పాల్పడుతున్న తెలంగాణ ప్రభుత్వం… రాయలసీమకు తీరని అన్యాయం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్, వ్యవసాయము, మానవ వనరుల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారని, ఇందుకు స్వర్గీయ నెహ్రు ఆవిష్కరించిన శిలాఫలకంలో స్పష్టంగా ఉందన్నారు. తెలంగాణ మంత్రులు .. పోతిరెడ్డిపాడు వద్ద నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుపై మతిలేని వాదన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నికర జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించారని, ఆ ప్రాజెక్టుపై లేనిపోని అభ్యంతరాలు చెప్పడం దారుణమన్నారు. రాయలసీమపై యుద్ధం చేస్తామని టీ మంత్రులు అంటున్నారని, అందుకు సీమవాసులు భయపడరని స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించి.. దక్షిణ తెలంగాణలో రాజకీయ సమీకరణాల కోసం ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడటం సమంజసం కాదన్నారు.