‘యూనియన్ బ్యాంకు’ స్కీంలను సద్వినియోగం చేసుకోండి
1 min readయూనియన్ బ్యాంకు కర్నూలు రీజనల్ హెడ్ పి. నరసింహరావు
పల్లెవెలుగు: ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ అమలు చేసే కొత్త స్కీంలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు యూనియన్ బ్యాంకు కర్నూలు రీజనల్ హెడ్ పి.నరసింహ రావు. ఖాతాదారుల ఉన్నతి కోసం రూపొందించిన వివిధ పథకాలను ఆయన వెల్లడించారు. పెన్షనర్లు, వ్యాపారవేత్తలు, మహిళల సాధికారత కోసం కొత్త స్కీంలను తీసుకొచ్చిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా బంగారు రుణ పథకం, కారు కొనుగోలు, ఇంటి కొనుగోలు కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం తక్కువ వడ్డీ రేట్లతో రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ వడ్డీతో అతి సులువుగా.. వేగంగా రుణాలు ఇస్తామన్నారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకం కింద 18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల బ్యాంకు ఖాతాదారులకు వార్షిక ప్రీమియం రూ.20 లకు రూ. 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని, ఆ సొమ్ము మీ తరువాత కుటుంబీకులకు లభిస్తుందన్నారు. అలాగే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజీజీబీవై ), అటల్ పింఛన్ యోజన (ఏపీవై) తదితర స్కీంల ద్వారా లబ్ధి పొందవచ్చని ఖాతాదారులకు కర్నూలు రీజనల్ హెడ్ పి. నరసింహ రావు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఖాతాదారులకు సూచించారు.