ఫిర్యాదులు రాకుండా చూసుకోండి..!
1 min read– అధిక ఫీజులు వసూలు చేస్తే .. చర్యలు తప్పవు
– ‘కోవిడ్’ బాధితులకు మెరుగైన చికిత్సలు అందించాలి
– ఓమిని ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, కమిషనర్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కోవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్ జి. వీరపాండియన్. సోమవారం నగరంలోని ఓమిని ప్రైవేట్ ఆస్ప్రతిని కలెక్టర్‌తోపాటు నగర కమిషనర్ డికే బాలాజి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో హెల్ప్ డెస్క్, ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత మంది వైద్య చికిత్సలు పొందుతున్నారు తదితర అంశాలపై హాస్పిటల్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే 104 కాల్ సెంటర్‌కు కానీ ఆరోగ్య మిత్ర హెల్ప్ డెస్క్ వద్ద గానీ ఎవరైనా ఫిర్యాదులు చేశారా.. తదితర వివరాలపై ఆరా తీశారు. కోవిడ్ ట్రీట్మెంట్ పై, ఆక్సిజన్, రేమిడిసివర్ అందుబాటు పై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ జి. వీరపాండియన్ మాట్లాడుతూ ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించిన కలెక్టర్ … బాధితుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఓమిని ఆస్పత్రి నిర్వాహకులను హెచ్చరించారు.