టేక్ హోమ్ రేషన్ కిట్లు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టండి
1 min read– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : గర్భవతులకు, బాలింతలకు సరఫరా చేస్తున్న టేక్ హోమ్ రేషన్ కిట్లను సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో ఐసిడిఎస్ అధికారులతో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమీక్ష సమావేశం నిర్వహించారు.సందర్భంగా జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య మాట్లాడుతూ గర్భవతులకు, బాలింతలకు సరఫరా చేస్తున్న టేక్ హోమ్ రేషన్ కిట్లను సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అంగన్వాడి పరిధిలో ఉన్న రక్తహీనత కలిగిన గర్భిణీ స్త్రీలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పౌష్టిక విలువలు కలిగిన ఆహారాన్ని అందేలా చూడాలని సిడిపిఓ లను ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్స్ పరిధిలో రక్తహీనతకు సంబంధించిన పరీక్షలను వైద్య సిబ్బంది చేస్తున్నారా, రక్తహీనతతో ఉన్న వారిని గుర్తించినట్లయితే వారికి ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి సెంటర్లో మెనూ ప్రకారం పిల్లలకు ఆహారం అందిస్తున్నారా, సెంటర్లలో ఎంతమంది బరువు తక్కువ పిల్లలు ఉన్నారు, ఎంతమంది వయసుకు తగిన ఎత్తు లేని పిల్లలు ఉన్నారు వీటన్నిటిని పరిశీలిస్తున్నారా అని సిడిపివోలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి సెంటర్లకు సచివాలయ మహిళా పోలీసు వస్తూ ఉంటారా వారు వచ్చి అంగన్వాడి సెంటర్లలో ఏమి ఏమి పరిశీలిస్తారని సిడిపిఓ లను అడగగా మహిళా పోలీసు వచ్చి అంగన్వాడి కేంద్రాల పరిశుభ్రతను, వండిన ఆహారము మెనూ ప్రకారం ఉన్నదా? సెంటర్ పరిధిలోని టాయిలెట్స్ శుభ్రంగా ఉన్నాయా వీటన్నిటిని చూసి వాటి వివరాలను యాప్ నందు నమోదు చేస్తారని సిడిపిఓలు జాయింట్ కలెక్టర్ కు వివరించారు. అంగన్వాడి సెంటర్లకు బియ్యము, కందిపప్పు, ఆయిల్, తదితర సరుకులు సక్రమముగా అందుతున్నాయా అని సిడిపిఓ లను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి ఉమామహేశ్వరి, సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు.