రెస్టారెంట్ పునరుద్ధరీకరణకు చర్యలు చేపట్టండి
1 min read– టూరిజం అధికారిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల పట్టణ సమీపంలోని చిన్న చెరువు కట్టపై వున్న పర్యాటక రెస్టారెంట్ పునరుద్ధరీకరణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ జిల్లా పర్యాటక అధికారిని ఆదేశించారు. మంగళవారం చిన్న చెరువు ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రజలు సాయంత్రం వేళల్లో ఆహ్లాద వాతావరణంలో గడిపేందుకు చిన్న చెరువు కట్టపై రెస్టారెంట్ పునరుద్ధరించి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రీన్ కో ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ టూరిజం అధికారిని ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశంలో గుంతలు లేకుండా చదును చేసి పార్కింగ్ కు అనుకూలంగా తీర్చిదిద్దాలన్నారు. రెస్టారెంట్ సమీపంలోని సుంకులమ్మ దేవాలయం నుండి చిన్న చెరువు కట్ట మీదుగా రెస్టారెంట్ వరకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రెస్టారెంట్ పరిధి ఇరువైపులా మొక్కలు పెంచడంతోపాటు ఖాళీ ప్రదేశంలో కూడా మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రెస్టారెంట్ కు చేరువలో ఉన్న చిన్న చెరువులో పిచ్చి మొక్కలు, వ్యర్ధ పదార్థాలు లేకుండా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది సహకారం తీసుకొని పారిశుధ్య చర్యలు చేపట్టాలని జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు.