PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రహదారుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టండి

1 min read

– రహదారుల భద్రతా కమిటీ సమావేశంలో ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: జాతీయ, రాష్ట్ర రహదారులు, పట్టణాల్లోని ముఖ్య కూడళ్లలో ప్రమాద బ్లాక్ స్పాట్లను గుర్తించి భద్రత ప్రమాణాలను పటిష్టంగా అమలుపరచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబర్ లో రహదారుల భద్రత, ప్రమాదాల నియంత్రణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పి రఘువీర్ రెడ్డి, జిల్లా రవాణాధికారి నిరంజన్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డా. మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ ప్రమాదాల నియంత్రణకు యాక్సిడెంట్ జోన్లను గుర్తించి రహదారి భద్రత ప్రమాణాలు పటిష్టంగా అమలుపరిచి…. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలని ఉప రవాణా, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి తదితర సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీలో నిర్ణయం తీసుకొని అందుబాటులో ఉన్న నిధులతో భద్రతా చర్యలను వెంటనే చేపట్టాలన్నారు. అవసరమైన నిధులు అందుబాటులో లేకపోతే పక్కా ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం బ్రిడ్జిపై బస్టాండు-నూనపల్లెకు వెళ్లే మలుపు ఇరుకుగా, ప్రమాదకరంగా ఉందని అదనపు ఫిల్లర్లు వేసి రోడ్డు వెడల్పుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి నూనెపల్లి జంక్షన్ వరకు రహదారి విస్తరణకు కూడా తగు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్, రవాణా, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖల అధికారులు ఐరాడ్ యాప్ ద్వారా ప్రతీ రోడ్ ప్రమాదానికి గల కారణాలను, ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు విధిగా నివేదికను ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అతివేగంగా వాహనాలు నడిపే వ్యక్తులపై రవాణా, పోలీసు శాఖలు కఠినంగా వ్యవహరించాలన్నారు.తప్పనిసరి అనుకున్న ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే, ఆర్&బి, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వై జంక్షన్, నూనెపల్లి క్రాస్ రోడ్, టెక్కి సర్కిల్ తదితర ముఖ్య కూడలి ప్రదేశాల్లో ప్రమాదాల నియంత్రణకు గుర్తింపు సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ట్రాఫిక్, పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రమాదకర స్థలాల్లో 108 వాహనాలు, వాటి పరిసర పీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోను కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు గుర్తించిన ప్రదేశాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రమాదాల నియంత్రణపై డ్రైవర్లకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ను ఆదేశించారు.జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర రహదారుల్లో స్పీడ్ గన్స్, సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎస్పీ మహేశ్వర రెడ్డి, ఎంవీఐలు శ్రీకాంత్, రవి శంకర్ నాయక్, జి టి నాయుడు, క్రాంతికుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author