PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్సీ, ఎస్టీల ద్రోహిగా చరిత్రలో టీడీపీ

1 min read

– పాదయాత్ర పేరుతో ఎస్సీ, ఎస్టీలపై లోకేష్ కుట్ర; ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
– ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ సీఎం జగన్ పై విమర్శలా
– ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చుకో అంటూ హితువు
పల్లెవెలుగు వెబ్ సత్యవీడు: సీఎం జగన్ రాష్ర్టంలోని ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి ఓర్వలేక ఎస్సీ, ఎస్టీల మధ్య కుట్ర చేసేందుకే టీడీపీ నేత లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విమర్శించారు. ప్రతి వాడలో ఎస్సీ, ఎస్టీలు కనీస సదుపాయాలతో ఆర్థికంగా అభివవృద్ధి చెందాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రాష్ర్ట చరిత్రలో ఒక గిరిజన వాడలోని పాఠశాల అభివ`ద్ధి కోసం కోటి రూపాయలు నిధులు మంజూరు చేయడం చూశామా అని ప్రశ్నించారు. నాడు నేడు, నవరత్నాల పేరుతో ఎస్సీ, ఎస్టీల కుటుంబాల్లో ఆనందం వెల్లి విరుస్తోందన్నారు. అందుకనే గడప గడపకు వెళుతున్న తమకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకున్నారని పేర్కొన్నారు. సత్యవేడు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచిత భోజనశాలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం నాడు విలేకరులతో మాట్లాడారు. రాష్ర్ట విభజన తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోనే చెత్తబుట్టలో పడేసి ఐదేళ్ల పాటు ప్రజలను మోసం చేస్తే, సీఎం జగన్ ఎన్నికల హామీల కోసం ఇచ్చిన మేనిఫెస్టోను పూజగదిలో ఉంచి కేవలం మూడున్నరేళ్లలో 98 శాతం హామీలు అమలు చేశారని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సుపరిపాలనలో రాష్ర్ట ప్రజలు చల్లగా ఉన్నారని, ఎస్సీ, ఎస్టీలు భరోసాతో జీవించే పరిస్థితులు కల్పించారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఆర్థిక లబ్ధి చేకూరుస్తూ అండగా నిలుస్తున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు, నారా లోకేశ్ కు కనబడక పోవడం దారుణమన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అనుమతులు ఇచ్చిన శ్రీ సిటీలో నేడు 60 వేల మంది నిరుద్యోగ యువత ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఇతర నిరుద్యోగ యువతకు శ్రీ సిటీలోని పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలకు చట్టసభలో సమున్నత స్థానం
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక చట్ట సభల్లో ఎస్సీ, ఎస్టీలకు, మహిళలు సమున్నత స్థానం కల్పించారని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. టీడీపీ హయాంలో స్వయానా చంద్రబాబే ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని తమను అవమానించిన విషయాన్ని తాము ఎప్పటికీ మరచి పోమని మండిపడ్డారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని తెదేపా నేత లోకేష్ సీఎం జగన్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ కు సీఎం జగన్ గురించి మాట్లాడే స్థాయి, అర్హత రెండూ లేవని ముందుగా ఆయన ఏ నియోజవకర్గం నుంచి పోటీ చేయదలచుకున్నారో బహిరంగంగా వెల్లడించి ఆ తర్వాతే పాదయాత్ర చేపట్టాలని సూచించారు. గతంలో ఏ సీఎం చేయలేని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ హయాంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలన్నీ సీఎం జగన్ నెరవేరుస్తున్నారని.. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో అమ్మఒడి, నాడు నేడు, ఆసరా పెన్షన్లు మంజూరు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.
ఎస్సీ, ఎస్టీలను ఏనాడైనా పట్టించుకున్నారా..
తెదేపా హయాంలో కనీసం ఎస్సీ, ఎస్టీ లను పట్టించుకుున్న పాపాన పోలేదని.. కానీ, ఇప్పుడు సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం ఓర్వలేక ఎస్సీ, ఎస్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు మంజూరయ్యాయి, ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నామో స్వయంగా వచ్చి చూసిన తర్వాతే తెదేపా నేతలు విమర్శలు చేయాలని హితవు పలికారు. గ్రామాల్లో ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. లోకేష్ పాదయాత్రతతో ఎవరికి ఏం ఒరిగేది లేదన్నారు. లోకేష్ పాదయాత్రలో చుట్టూ 400 మంది వాలంటీర్లను పెట్టుకుని.. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెదేపా హయాంలో కనీసం ఒక సచివాలయ భవనం కూడా నిర్మించలేదని.. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సచివాలయాలు నిర్మించి వాటిలో 15 మంది ఉద్యోగులతో గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక చేనేతలకు సంవత్సరానికి రూ.24 వేల ఆర్థిక సాయం, కాపు నేస్తం, రైతు భరోసా వంటి పథకాలను అమల్లోకి తెచ్చి విజయం సాధించారన్నారు. సీఎం జగన్ తెచ్చిన పథకాలను చూసి ప్రజలు ఆశీర్వదిస్తుంటే.. ప్రతి పక్షాలకు కడుపు మండుతోందన్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరు లో రూ.33 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు మంజూరు చేశామని.. అంతేకాకుండా, టుడా నిధులతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో 44 హై స్కూల్స్ కు ఒక్కోదానికి రూ.కోటికి పైగా నిధులను కేటాయించడం ఎంతో హర్షించదగిన విషయం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతేకాకుండా, నియోజకవర్గంలో స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీ, ఎస్సీ, ఎస్టీలకు స్మశాన వాటికలు, 34 వేల మంది రైతు భరోసా పథకాలను అందిస్తున్నామన్నారు. ఎవరైనా పేదలు చనిపోతే వెంటనే అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం సచివాలయ సెక్రటరీల ద్వారా రూ.10 వేలు ఇప్పించే సదుపాయాన్ని కూడా కల్పించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక చట్ట సభల్లో ఎస్సీ, ఎస్టీలకు, మహిళలు సమున్నత స్థానం కల్పించారని తెలిపారు.

About Author