ఇద్దరి నేతల పదవులు తొలగించిన టీడీపీ
1 min read
పల్లెవెలుగువెబ్: తెలుగు దేశం పార్టీ మంగళవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్యదర్శులుగా కొనసాగుతున్న ఇద్దరు నేతలను ఆ పదవుల నుంచి తొలగించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పదవుల నుంచి తొలగింపునకు గురైన ఇద్దరు నేతలు కడప జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి చెందిన సాయినాథ్ శర్మ, మైదుకూరు నియోజకవర్గానికి చెందిన వెంకటసుబ్బారెడ్డిలు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. పార్టీ ఇన్‌చార్జీలతో విభేదించి మరీ వీరిద్దరూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన అధిష్ఠానం ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో వీరిద్దరినీ పార్టీ రాష్ట్ర కార్యదర్శుల పదవుల నుంచి తొలగిస్తూ అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.