కార్మిక సంఘాలకు…టీడీపీ అండగా ఉంటుంది: టిజి భరత్
1 min readపల్లెవెలుగు: కార్మిక సంఘాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. నగరంలోని మౌర్యఇన్ లోని పరిణయ ఫంక్షన్ హాల్ లో టి.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టిజి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తమకు తెలియజేస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అయితే ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇక కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తమ దృష్టికి తీసుకొని వస్తే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామన్నారు. టిడిపి ప్రకటించబోయే మేనిఫెస్టోలో ఈ సమస్యలను ప్రకటించి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో ఆర్టీసీ, ఆటో, ఉద్యోగస్తులు, ప్రెస్, సీఐటీయూ, మున్సిపల్, ప్లంబర్స్, మత్స్యకారులు, తదితర కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో టీఎన్టీయుసి కర్నూలు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు నరసింహులు, అజీజ్, నేతలు అశోక్, ప్రభాకర్, రామకృష్ణ, శ్రీనివాసులు, మోహన్ రావ్, తదితరులు పాల్గొన్నారు.