PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరులో ఉద్రిక్తత..

1 min read

– ఓటేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి.
– క్యూ లైన్లో వెళ్ళకుండా ఎలా వెళ్తారంటూ ప్రశ్నించిన వైకాపా నేతలు.
– మాండ్రకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైకాపా నేతలు.
– ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులకు పిర్యాదు చేసిన వైసీపీ నేతలు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికొన్నత పాఠశాలలో సోమవారం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికలు నిర్వహించారు. ఈ పాఠశాలలో 3 పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయుల ఎన్నికల కు 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 308 పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల చొరవతో సద్దుమణిగింది. సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం 2 :30 గంటల వరకు పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రశాంతంగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మధ్యాహ్నం 2 : 45 గంటల సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాండ్ర శివనందరెడ్డి తన అనుచరుల గణంతో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. పోలీసులు వారిని నివారించి ముగ్గురికి మాత్రమే అనుమతి ఉందని మిగతా వారిని బయటనే ఉండాలని పోలీసులు వారికి తెలిపారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసుల ఆదేశాలు లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళారు. పోలింగ్ కేంద్రం వద్ద పట్టణ ఎస్ ఐ ఎన్ వి రమణ వారిని నివారించి ఇంత మంది గుంపులుగా వెళ్లరాదని సూచించినప్పటికి వారి ఆదేశాలు లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రం 308 లోపలికి వెళ్ళారు. అక్కడే ఉన్న వైకాపా పార్టీకి చెందిన ఏజెంట్లు తమ నాయకులకు సమాచారం అందించారు. దీంతో వైకాపా నాయకులు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ,ఎం పిపి మురళీకృష్ణ రెడ్డి, ఓంకార్ రెడ్డి, వైకాపా విద్యార్థి సంఘం అధ్యక్షులు సురేష్ యాదవ్ లు 308 పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని తెలుగుదేశం పార్టీ నేతలు క్యూలో వెళ్లకుండా నిబంధనలు అతిక్రమించి పోలింగ్ కేంద్రం లోపలికి ఎలా వెళ్తారంటూ వారిని వెంటనే బయటకు పంపించాలని పోలీసులతో వాదనకు దిగారు. కొద్దిసేపటిపాటు పోలీసులకు, వైకాపా నాయకులకు తోపులాట జరిగింది. మాండ్ర శివనందరెడ్డి కి వ్యతిరేకంగా మాండ్ర డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.మాండ్రను బయటకు పంపేంతవరకు మేము ఇక్కడినుండి బయటకు వెళ్ళమని వైకాపా నాయకులు తెగేసి చెప్పారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న పట్టభద్రులు ఎం జరుగుతుందో అని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ విజయభాస్కర్ తమ సిబ్బందితో పోలింగ్ కేంద్రానికి హుటాహుటిన చేరుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన వైకాపా నాయకులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దారు. ఇరువర్గాల వారితో మాట్లాడి అక్కడి నుండి పంపించారు. ఈ విషయం జిల్లా ఎస్ పి రఘువీరారెడ్డి కి తెలియడంతో అదనపు పోలీస్ బలగాలు పంపించారు. అదనపు ఎస్ పి రమణ, సిబ్బందితో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలు ఎవరు అతిక్రమించి చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ మురళీకృష్ణ రెడ్డిలు మాండ్ర శివానంద రెడ్డి పై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా పిర్యాదు చేస్తామని వైకాపా నేతలు మీడియాతో తెలిపారు. ఈ సంఘటనపై టీడీపీ నాయకులు మాండ్ర శివనందరెడ్డి ని అడుగగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఓటు హక్కును వినియోగించుకున్నామని , జరిగిన సంఘటనపై నో కామెంట్స్ అంటూ వెళ్లిపోయారు.

About Author