PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్దిగట్ల పొలిమేర లో ఉద్రిక్తత..

1 min read

– డంపింగ్ యార్డు సర్వే ను అడ్డుకున్న దళిత రైతులు..
పల్లెవెలుగు, వెబ్​ నందికొట్కూరు: డంపింగ్ యార్డు పేరుతో తమ భూములు లాక్కోవాలని చూస్తున్నారంటూ నందికొట్కూరు మండలం మద్దిగట్ల గ్రామ దళిత రైతులు ఆందోళన చేపట్టారు.మంగళవారం సర్వే కోసం వచ్చిన రెవిన్యూ సిబ్బంది వీఆర్వో, సర్వేయర్ ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.విషయం తెలుసుకున్న తహశీల్దార్ రాజశేఖర్ బాబు, నందికొట్కూరు అర్బన్ సిఐ విజయ భాస్కర్ అక్కడికి చేరుకున్నారు. ప్రజా సంఘాల నాయకులు, బాధిత రైతులతో చర్చలు జరిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే సర్వే చేపట్టినట్లు రెవిన్యూ అధికారులు తెలిపారు.ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేయరాదని రైతులు, ప్రజా సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. తమ భూముల జోలికి వస్తే ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. 15 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను డంపింగ్ యార్డు పేరిట అధికారులు ఇప్పుడు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు .ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న భూమిని లాక్కుంటే తాము ఊరుకోబోమని బాధితులు నిరసన చేపట్టి సర్వేను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.తమకు అనుభవం లో ఉన్న భూమిని తమకు పట్టా చేసి ఇవ్వాలని పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 ఎకరాల భూమిని తలా కొంత సాగు చేసుకుంటూ బతుకీడుస్తున్నామన్నారు. తమ జీవనాధారాన్ని లాక్కుని డంపింగ్ యార్డు ఏర్పాటు వలన తాము అన్యాయమైపోతామని గోడు వెళ్లబోసుకున్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు సాగు చేసుకుంటున్నా వ్యవసాయ భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నందికొట్కూరు మండలం లోని 71, 119, 11, 3, 70 సర్వే నెంబర్లలో ఏబీయం పాలెం కు చెందిన దళితులు మరియు వడ్డెర కాలనీకి చెందిన బీసీలు ముస్లిం మైనారిటీలు గత కొన్ని ఏళ్లుగా దాదాపుగా 50 ఎకరముల భూమిని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలతో మున్సిపల్ అధికారులు రైతుల భూములలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. విషయం తెలుసుకున్న రైతులు ఆందోళనకు దిగారు. గత వారం క్రితం గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆర్థర్ కు అధికారుల చర్యలపై రైతులు ఫిర్యాదు చేశారు.స్పందించిన ఎమ్మెల్యే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల భూముల లో డంపింగ్ యార్డు ఎలా ఏర్పాటు చేస్తారని మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇది ఇలా ఉండగానే అధికారులు రైతులకు తెలియకుండా రహస్యం గా సర్వే చేపట్టడంలో ఆంతర్యం ఏమిటి అని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు.మంగళవారం చేపట్టిన సర్వే ను అడ్డుకున్నారు. చేసేదిలేక అధికారులు వెనుదిరిగారు .కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ,కుల సంఘాల నాయకులు బీఎస్పీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త స్వాములు , ఎం ఆర్పీ ఎస్ జిల్లా నాయకులు ప్రేమ రాజు, సీపీఎం నాయకులు పక్కీర్ సాహెబ్, కొనిదేల రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author