PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పకడ్బందీగా… పది  పరీక్షలు నిర్వహించాలి

1 min read

ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక‌్షన్‌ అమలు చేయాలి

కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ లాంటివి జరగకూడదు

జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా, ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని   జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం  కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ పకడ్బందీ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో  జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి  మాట్లాడుతూ మార్చి  నెల 18 నుండి 30వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు, మార్చి 18 నుండి 27 వరకు జరిగే పదవ తరగతి, ఇంటర్మీడియేట్ ఓపెన్ పరీక్షలకు, మార్చి 30 నుండి ఏప్రిల్ 3 వ తేది వరకు జరిగే ఇంటర్మీడియేట్ ఓపెన్ ప్రాక్టికల్  పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగరాదని పరీక్షల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర 144 సెక‌్షన్‌ అమలు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగర ఆర్మ్డ్ గార్డ్స్ ని ఏర్పాటు చేయాలని, పేపర్ డిస్ట్రిబ్యూషన్ కి ఎస్కార్ట్ తో వెళ్లాలని, పరీక్ష కేంద్రాల పరిధిలో ఉన్న జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం ఉండాలని, పరీక్షా కేంద్రంలో త్రాగు నీటి వసతి కల్పించాలని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.  విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి చేరుకునేందుకు అవసరమైన బస్సు సదుపాయాలు కల్పించాలని, రవాణా విషయంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల దగ్గర పారా మెడికల్ స్టాఫ్ తో పాటు, ఓఆర్ఎస్, మెడికల్‌ కిట్లు ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ జరగకుండా  పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా  రెవెన్యూ అధికారి అధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు సంబంధించి పరీక్షల నిర్వహణకు 162 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 37,801 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఇందుకోసం 162 పరీక్ష కేంద్రాలలో 162 చీఫ్ సూపరింటెండెంట్లు, 162 డిపార్ట్మెంట్ ఆఫీసర్ లను నియమించడం జరిగిందన్నారు. పరీక్షల పర్యవేక్షణకు 7 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మకంగా ఉన్న పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా మార్చి 18 నుండి 27 వరకు జరిగే పదవ తరగతి ఓపెన్ పరీక్షల నిర్వహణకు 12 సెంటర్లు , ఇంటర్మీడియేట్ ఓపెన్ పరీక్షల నిర్వహణకు 9 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. సమీక్షలో  వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author