ఈ అరాచక పాలన మళ్లీ వద్దు: టీజీ భరత్
1 min readశ్రీరామ్ నగర్‌లో తెలుగుదేశంపార్టీ చేరికల కార్యక్రమం
- వైసీపీని వీడి టీడీపీలో చేరిన 23, 24 వార్డుల యువకులు, మహిళలు
కర్నూలు, పల్లెవెలుగు:ఐదేళ్లు అనుభవించింది చాలని.. మళ్లీ ఈ అరాచకమైన పాలన తెచ్చుకోవద్దని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని శ్రీరామ్ నగర్‌లో 23, 24 వార్డులకు చెందిన సునీల్, ప్రవీణ్ వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీజీ భరత్ వీరితోపాటు మహిళలకు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో కరెంట్ బిల్లులు, ఇంటి పన్నులు, నిత్యావసర సరుకులు, గ్యాస్ ధరలు పెరిగిపోయాయే గానీ.. తగ్గింది లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే.. ఈ రకమైన బాదుడు ఉండదని చెప్పారు. చంద్రబాబు నాయుడు వస్తే ధరలు నియంత్రణలో ఉంచుతారని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఒక్క కియా పరిశ్రమ అనంతపురం రూపురేఖలు మార్చేసిందని తెలిపారు. కర్నూలులో మహిళల స్వయం ఉపాధి కోసం ఏదైనా ప్రాజెక్ట్ రూపొందించి తను గెలిచిన తర్వాత తన దగ్గరకు వస్తే తమ సొంత నిధులతో గానీ, ప్రభుత్వ నిధులతో గానీ దాన్ని ప్రారంభించి మహిళలకు ఉపాధి కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఉన్న నాయకులు ఐదేళ్లలో ఎంత సంపాదించాలని ఆలోచించి రాజకీయాల్లోకి వస్తున్నారని.. తాము మాత్రం ఎంత సేవ చేయాలని నిరంతరం ఆలోచిస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని, మెగా డీఎస్సీ అని ఊరించి చివరకు ఎత్తేశారని విమర్శించారు. చివరకు స్థానికేతురుడిని తీసుకువచ్చి తనకు పోటీ నిలబెట్టారని అన్నారు. 40 ఏళ్ల నుంచి ప్రజా సేవ చేస్తున్న తమ కుటుంబాన్ని ఆదరించాలని టి.జి భరత్ కోరారు.
నా క్యాడర్‌ను టచ్ చేస్తే ఊరుకోను:
తన క్యాడర్‌పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఎంత మాత్రం ఊరుకోనని టీజీ భరత్ హెచ్చరించారు. ఎలాంటి కండీషన్లు లేకుండా సునీల్, ప్రవీణ్ తన దగ్గర చేరారని అన్నారు. కేవలం వార్డు ప్రజల కోసం స్థానిక సమస్యలు తీరిస్తే చాలని తనతో చెప్పారన్నారు. తన క్యాడర్‌పై చేయి వేస్తే.. ఎంతటి వారైనా వదిలిపెట్టని.. కార్యకర్తలకు అండగా తాను ఉంటానని టిజి భరత్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, సీనియర్ నాయకులు బషీర్, స్వామిరెడ్డి, అబ్బాస్, జనసేన నాయకులు పవన్, తదితర ముఖ్య నాయకులు, 23, 24 వార్డుల బూత్ ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.