ఐదేళ్లలో చేసింది కోడి గుడ్డంత.. చెప్పుకునేది కొండారెడ్డి బురుజంత
1 min read: టీడీపీ అభ్యర్థి టీజీ భరత్
14వ వార్డు బుధవారపేటలో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో చేసింది కోడి గుడ్డంత అయితే.. చెప్పుకునేది కొండారెడ్డి బురుజు అంతని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఎద్దేవా చేశారు. నగరంలో 14వ వార్డు బుధవారపేటలో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి తన ఆరు గ్యారెంటీల కరపత్రాలను అందించారు. గ్యారెంటీలను వివరించి.. ఒక్క అవకాశం ఇచ్చి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. సంక్షేమ పథకాల రూపంలో ఒక చేత్తో డబ్బులు ఇస్తూనే.. నిత్యావసర సరుకులు ధరలు, పన్నులు పెంచి మరో చేత్తో డబ్బులు మొత్తం లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయలతో కర్నూలులో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న అధికార పార్టీ నేతలు.. ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ వీధికి వెళ్లినా సమస్యలు తప్ప.. అభివృద్ధి కనిపించడం లేదన్నారు. హంద్రీ నదిని మొత్తం వ్యర్థాలతో నింపేశారని.. దీంతో ప్రజలు అంటు వ్యాధుల బారిన పడాల్సి వస్తుందన్నారు. అందుకే ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కర్నూలు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను తాను గెలిచిన తరువాత ఐదేళ్లలో శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వార్డు పర్యటనకు వచ్చిన టీజీ భరత్‌కు మహిళలు, వృద్ధులు, యువకులు సమస్యలు మొరపెట్టుకున్నారు. వర్షం వస్తే చాలు మురుగు నీరు మొత్తం ఇళ్లలోకి వచ్చేస్తుందని తెలిపారు. ఈ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. సమస్యలకు నిలయంగా మారిన కర్నూలును అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జకియా అక్సారీ, మాజీ కార్పొరేటర్లు అబ్బాస్, రామాంజినేయులు, జనసేన పార్టీ రాష్ట్ర ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఛైర్మన్ రేఖా, పవన్, టిడిపి యువ నాయకులు కరిముల్లా, రియాజ్, షేక్, మెహబూబ్, శ్యామ్, ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.