యువగళం పాదయాత్ర విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు : టి.జి భరత్
1 min read– తెదేపా వస్తే కర్నూల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని లోకేష్ చెప్పారు.. టిజి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం చేసిన ప్రజలందరికీ కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. వీధుల్లో ఘన స్వాగతం పలకడంతో పాటు లోకేష్ పై చూపించిన ప్రత్యేక అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. నారా లోకేష్ కర్నూలు పర్యటన సందర్భంగా ఇక్కడి ప్రజల సమస్యలను లోకేష్ తో ప్రత్యేకంగా చర్చించినట్లు భరత్ చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నారా లోకేష్ కు సవివరంగా వివరించినట్లు భరత్ తెలిపారు. ప్రధానంగా తుంగభద్ర, హంద్రీ, కేసి కెనాల్ కర్నూలు చుట్టూ ఉన్నప్పటికీ ప్రజలు త్రాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని లోకేష్ దృష్టికి భరత్ తీసుకువెళ్లారు. కర్నూలు ప్రజల శాశ్వత త్రాగునీటి కష్టాలు తీర్చేందుకు టిడిపి ప్రభుత్వం వచ్చాక కృషి చేస్తానని లోకేష్ ఈ సందర్భంగా చెప్పినట్లు భరత్ తెలిపారు. ఇక ఇండస్ట్రీయల్ జోన్ ఉన్న కర్నూల్లో పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించాలని, హైకోర్టు బెంచ్ కర్నూల్లో ఏర్పాటు చేయాలని, వక్ఫ్ బోర్డు భూములు, క్రిస్టియన్ ఆస్తులు, హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా వాటిని పరిరక్షించేందుకు టిడిపి ప్రభుత్వంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధానంగా లోకేష్ ద్రుష్టికి తీసుకెళ్లినట్లు భరత్ చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా వీటన్నింటిపై ప్రత్యేక చొరవ తీసుకొని పని చేస్తామని లోకేష్ చెప్పారని భరత్ తెలిపారు. ఇక టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లీంల సంక్షేమానికి తీసుకొచ్చిన పథకాలన్నీ ఈ ప్రభుత్వం రద్దు చేసిందని.. మళ్లీ టిడిపి వచ్చిన వెంటనే అప్పటి పథకాలన్నీ పునరుద్ధరిస్తామని లోకేష్ చెప్పారన్నారు. ఇక జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లకు నిధులు కేటాయించి కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు మేలు చేస్తామని లోకేష్ చెప్పారన్నారు. ఇక హంద్రీనది కారణంగా ముంపుకు గురవుతున్న ప్రజల బాధలను పరిష్కరిస్తామని లోకేష్ చెప్పారని భరత్ చెప్పారు. ఇక చిరు వ్యాపారస్తులపై పన్నుల భారం పడకుండా ఉండేందుకు మా ప్రభుత్వంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్లు భరత్ చెప్పారు. దీంతో పాటు అర్హులైన ఎంతో మందికి పెన్షన్లు తొలగించారని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారన్నారు. ఇక కర్నూలులో భవన నిర్మాణ కార్మికులు ఎంతో మంది ఉన్నారని.. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుకను ఉచితంగా అందించి కార్మికుల ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఇక లోకేష్ విడిది కోసం గ్రౌండ్ ఇచ్చిన ఎస్టీబిసి కళాశాల యాజమాన్యం, ఉస్మానియా కళాశాల యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు భరత్ అన్నారు. లోకేష్ బాబు పర్యటన విజయవంతం చేసిన టిడిపి నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు భరత్ చెప్పారు.