PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసైన్డ్ భూముల చట్ట సవరణను తక్షణం రద్దు చేయాలి..

1 min read

ప్రజల రాజ్యాంగ హక్కులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హరించివేయడం దుర్మార్గం..

2013 భూ సేకరణ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలి..

సమగ్ర భూ సర్వే సమస్యలను పరిష్కరించాలి..

అసైన్డ్ భూములను పేదలకే అప్పగించాలి..

అఖిలపక్ష రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక, ప్రజా సంఘాలు మరియు న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ ముందు ధర్నా..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :రైతులకు, వ్యవసాయ కార్మికులకు, దళితులకు, గిరిజనులకు, ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే భూ యాజమాన్య హక్కుల చట్టం  అసైన్డ్ భూముల చట్ట సవరణను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక, ప్రజాసంఘాలు మరియు న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, బి.కె.యం.యు జిల్లా అధ్యక్షులు  బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఓ.శైలజ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎన్.వి.డి ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస డాంగే తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కుల చట్టం -2022 పేరుతో 2023 అక్టోబరు 31న జారీ చేసిన జీవో 512 ద్వారా తీసుకువచ్చిన ఈ చట్టంలో  రైతులకు, ప్రజలకు నష్టం కలిగించే అత్యంత ప్రమాదకర నిబంధనలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, భవనాలు తదితర అన్ని రకాల స్థిరాస్తులపై హక్కులను నిర్ధారించి టైటిల్ రిజిస్టర్లు నమోదు చేసే అధికారాన్ని రెవిన్యూ అధికారులకు అప్పగించడం వలన రాజకీయ నాయకులు జోక్యం పెరిగి రైతులు, ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు.  ఈ చట్టంలో సెక్షన్ 38 ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు భూమి హక్కు అప్పిలేట్ ఆఫీసర్ కు నిర్ణయాధికారం కలిగిన ఏ విషయంలోనైనా సివిల్ కోర్టులకు జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు. సెక్షన్ 25 ప్రకారం ఒక ఆస్తి యజమాని మరణిస్తే వారసుడు ఎవరు అనేది రెవిన్యూ అధికారులే నిర్ణయిస్తారని, ఇప్పటివరకు రెవెన్యూ అధికారుల చర్యలపై కోర్టులు తీర్పులు చెప్పడం జరుగుతున్నదని, ఈ చట్టం అమలు తర్వాత రెవెన్యూ అధికారుల సర్టిఫికెట్ ఉంటేనే కోర్టులు తీర్పులు చెప్పే అవకాశం ఉంటుందన్నారు. పేద రైతులు అధికారులతో వాదించి గెలవలేరని, రైతుల భూములను లాక్కొని  కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేవిధంగా  ప్రభుత్వాలు చట్టాలు రూపొందించడం అన్యాయమని విమర్శించారు. ఈ నియంతృత్వ ధోరణి అత్యంత ప్రమాదకరమైనదని, రాజ్యాంగ విరుద్ధమైనదని అన్నారు. ప్రజలు వ్యక్తిగత ఆస్తులపై తమకున్న యాజమాన్యం హక్కులపై న్యాయపరమైన తీర్పు చెప్పి హక్కును రెవెన్యూ అధికారులకు అప్పజెప్పి న్యాయ వ్యవస్థపై రెవిన్యూ అధికారుల పెత్తనాన్ని ప్రోత్సహిస్తున్న ఈ భూయాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర భూ సర్వే లో వస్తున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. భూసేకరణలో పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు నష్టపరిహారం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ వలన దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్ రద్దు చేసి 2013 భూ సేకరణ చట్టాన్ని యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రాజ్యాంగ వ్యతిరేక, ప్రజావ్యతిరేక చట్టాలు రద్దు చేయకపోతే రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, బి.కె.ఎం.యు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకులు బి.సోమయ్య, పుప్పాల కన్నబాబు,కడుపు కన్నయ్య,కోన శ్రీనివాసరావు, పంతగాని ఆనందం, సిహెచ్ మణి, డి.నాగేంద్ర, సిహెచ్ జాన్ రాజు, జి లక్ష్మి, యేసు మణి, లలిత,గోలిమే బాల యేసు, బుగ్గల ప్రభాకర రావు,,మాండ్రు జాన్, అరిగెల యోహాను, బి. యేసు రత్నం, గూడా ఝాన్సీ, ఎ.అప్పలరాజు, కడుపు కన్నయ్య, పుప్పాల శ్రీనివాసరావు, సాదే బాబు ప్రసాద్,కె.ఎస్.ఎన్.మూర్తి, గౌడు రంగబాబు లంక రామ్మోహన్,ఎస్.వి. సుబ్బారావు,యోహాన్ రాజు,కట్టా సత్యనారాయణ, పి.దావీదు,బి.చింతయ్య, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author