ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత కూటమిపై ఉంది!
1 min read
అందుకే కూటమికి 94శాతం సీట్లతో విప్లవాత్మకమైన గెలుపు నందించారు
దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున అభివృద్ధి
అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో లోకేష్
యలమంచిలి న్యూస్ నేడు : ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, 151 సీట్లు 11 కావడానికి గత పాలకుల అరాచకమే కారణం, ఈ విప్లవాత్మకమైన ప్రజాతీర్పు సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా నడిపించేందుకు ఇచ్చారు. అరాచకపాలన నుంచి విముక్తికోసమే గత ఎన్నికల్లో 94శాతం సీట్లు కూటమికి ఇచ్చారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. యువగళంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 347కోట్ల అంచనా వ్యయంతో అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు సుమారు 14కి.మీ.ల పొడవైన రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా… ఆనాడు ప్రజలు పెద్దఎత్తున నా సభలకు వస్తే స్టూలుపై నించుని మాట్లాడా. ఆనాడు ఇదే పోలీసు అధికారులు నా మైక్ లాక్కున్నారు. ఎన్నికల్లో అందరికీ దిమ్మదిరిగేలా తీర్పువచ్చింది. ఆనాడు ప్రజాప్రతినిధులను కలిసేందుకు ప్రజలకు అవకాశం ఉండేదికాదు. ఫేస్ బుక్ లో పోస్టు పెడితే జైలుకు పంపారు. నాపై 23 కేసులు పెట్టారు, హోం మంత్రి అనితపై కూడా ఆనాటి ప్రభుత్వం 23 కేసులు పెట్టింది. పులివెందులలో దళితమహిళను హత్యచేస్తే చూడటానికి వెళ్తే కూడా ఆమెపై తప్పుడుకేసు పెట్టారు. డైనమిక్ లీడర్ అయ్యన్నపాత్రుడు ప్రజలతరపున పోరాడితే ఆయనపై నిర్భయ కేసు పెట్టారు. ఎన్నికేసులు పెట్టినా ప్రజలు మా వెనుక ఉండి నడిపించారు. మాకు మీరు అండగా నిలిచారు. చంద్రబాబునాయుడును 53రోజులు బంధిస్తే మీరు అండగా నిలబడ్డారు.
అభివృద్ధి, సంక్షేమం కోసం కసితో పనిచేస్తున్నాం
రాష్ట్రంలో పెద్దఎత్తున సంక్షేమం, అభివృద్ధి చేయాలనే కసితో పనిచేస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్ 4వేలు పెంచి ప్రతినెలా ఇంటికి వెళ్లి అందిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్దమొత్తంలో పెన్షన్ అందించడంలేదు. అన్నక్యాంటీన్లను తెరిపించాం, గ్యాస్ సిలండర్లు అందిస్తున్నాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ రెండునెలల్లో అందిస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆనాడు అచ్యుతాపురం – అనకాపల్లి రోడ్డులో గోతులను స్కేలు పెట్టి కొలవాల్సి వచ్చింది, ఏ గుంతలో ఎప్పుడు పడతామో తెలియని పరిస్థితి. ఎన్ డిఎ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోతులు పూడ్చడానికి నిధులు మంజూరుచేశాం. ఈ రోడ్డును 4లైన్ల రోడ్డుగా విస్తరిస్తానని యువగళంలో హామీ ఇచ్చాను. ఈరోడ్డు కోసం మీ ఎమ్మెల్యే వెంటాడారు. ఆయన ప్రోద్భలంతో ఈ రోడ్డును ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక్కడి ప్రజల షాపులు, ఇళ్లకు ఇబ్బంది లేకుండా కలెక్టర్, రెవిన్యూ అధికారులు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీమళ్లీ రావు, ప్రజలంతా సహకరించండి. ఎన్ టిపిసి గ్రీన్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్కు మీ ప్రాంతానికి వస్తున్నాయి. వీటివల్లపెద్దఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఎంపిగా సిఎం రమేష్, ఎమ్మెల్యేగా సుందరపు విజయకుమార్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఆనాడు ప్రధాని మోడీ ఎన్నిసీట్లు వస్తాయని అడిగితే 22 గెలుస్తామని చెప్పా. ప్రమాణ స్వీకారం సమయంలో ప్రధాని వద్దకు వెళ్లి ఒకటి తక్కువ వచ్చినందుకు క్షమాపణలు కోరాను.
అయిదేళ్లలో అనకాపల్లి, యలమంచిలి రూపురేఖలు మారుస్తాం
రాష్ట్రాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని ప్రధాని మోడీ భుజం తట్టారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక దక్షిణ భారతంలో లేనివిధంగా అభివృద్ధి చేస్తున్నాం. అయిదేళ్లలో అనకాపల్లి, యలమంచిలి ప్రాంత రూపురేఖలు మార్చే బాద్యత ఎన్ డిఎ ప్రభుత్వం తీసుకుంటుంది. టిడిపి, కూటమి కార్యకర్తలు కసితో ప్రజలకోసం అహర్నిశలు కష్టపడాలి. ప్రతినెలా 1వతేదీన ఇంటింటికీ వెళ్లి అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వాలి. గ్రామాల్లో సమస్యలను ఎంపి, ఎమ్మెల్యేలకు తెలియజేసి పరిష్కరించాలని కూటమి కార్యకర్తలను కోరుతున్నా. గత అయిదేళ్లలో ప్రజలపై అడ్డగోలుగా కేసులు పెట్టారు. బాబుగారి ఇంటి గేటుకు తాళ్లుకట్టారు. ఆయన రామతీర్థం వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తే వెళ్లకుండా ఎస్పీనే టిప్పర్లు అడ్డుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలకోసం మనం కలసికట్టుగా పోరాడాం. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే కలసి పోరాడదాం, సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామని పవనన్న చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎంపి సిఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, టిడిపి ఇన్ చార్జి ప్రగడ నాగేశ్వరరావు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.
