బాబు జగ్జీవన్ రావు ఓపెన్ ఎయిర్ థియేటర్ కూల్చడం దారుణం
1 min read–తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి
పల్లెవెలుగు వెబ్: కర్నూలు నగర నడిబొడ్డున కొండారెడ్డి బురుజు ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ఓపెన్ ఎయిర్ థియేటర్ కూల్చివేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కళలు, కళాకారుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి ? అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ కు ఎంతో చరిత్ర ఉందని.. 44 సంవత్సరాలుగా కళామతల్లికి వేదికగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. దైనందిన జీవితంలో ప్రజలకు ఆహ్లాదం పంచే కళలు, కళకారులు, కళా వేదికలు అంటే ప్రభుత్వానికి చిన్న చూపు తగదని ఆయన విమర్శించారు. కూల్చే ప్రయత్నం చేయొద్దని అభ్యంతరం వ్యక్తం చేసినా.. అన్యాయం చేయొద్దని వేడుకున్నా పెడచెవిన పెట్టి కూల్చివేయడం అత్యంత దారుణమన్నారు. కళాకారులే కాదు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే ఓపెన్ ఎయిర్ థియేటర్ ను కూల్చివేయొద్దని కోరుకుంటుంటే ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇదే విషయాన్ని నిన్న మంత్రులకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తే నిలదీస్తామేమోనని అడ్డుకుని అభ్యంతరం చెప్పారని హనుమంతరావు చౌదరి తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారితో కలసి ఓపెన్ ఎయిర్ థియేటర్ పునర్ నిర్మించే వరకు పోరాటం కొనసాగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలపై ఏమాత్రం గౌరవం ఉన్నా కూల్చివేసిన ఓపెన్ ఎయిర్ థియేటర్ ను వెంటనే పునర్నిర్మించాలని హనుమంతరావు చౌదరి డిమాండ్ చేశారు.