ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది
1 min read– ఎన్నికల పరిశీలకులు ఎస్. సురేష్ కుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియమించబడిన ఎన్నికల పరిశీలకులు, పాఠశాల విద్యా శాఖ కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ గురువారం జిల్లాలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక కలెక్టరేట్ కు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు ఎస్. సురేష్ కుమార్ కు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ పి . అరుణ్ బాబు తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబందించిన ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకులు సురేష్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఎన్నికల పరిశీలకులు, పాఠశాల విద్యా శాఖ కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరిలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడం ఆనవాయితీ ఉందని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అంశాలు ఏమైనా తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థుల తుది జాబితా అనంతరం బ్యాలెట్ పేపర్లను ముద్రించడం జరుగుతుందన్నారు.