కర్నూల్లో ఉన్న పేదవాళ్ల సొంతింటి కల నెరవేర్చుతా..
1 min readకర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్లో పేదవాళ్ల సొంతింటి కల తాను నెరవేర్చుతానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని కె.సి కెనాల్ వద్ద ఇందిరమ్మ, టిడ్కో, జగనన్న కాలనీ లబ్దిదారులు, సొంత ఇంటి స్థలం లేని వారికి స్థలాలు కేటాయించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ టిడిపి ప్రభుత్వ హయాంలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలన్న ఉద్దేశంతో 19 వేల టిడ్కో ఇళ్లు 90 శాతం పూర్తి చేశామన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం ఇళ్లను లబ్దిదారులకు అందజేయలేదన్నారు. ఇళ్లు నిర్మించిన ఘనత టిడిపికి దక్కుతుందన్న కారణంతోనే ఈ గృహాలను పట్టించుకోకుండా వదిలేసిందన్నారు. కరోనా సమయంలో టిడ్కో ఇళ్లు వేలాది మందికి ఉపయోగపడాయని ఆయన గుర్తుచేశారు. టిడిపి, జనసేన ప్రభుత్వం వచ్చేది ఖాయమన్నారు. కర్నూల్లో తనను గెలిపిస్తే ఆ తర్వాత ఈ ఇళ్ల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులతో కలిసి చర్చించి లబ్దిదారులకు న్యాయం చేస్తామన్నారు. ఇక ప్రజలకు ఎలాంటి మేలు చేయని నాయకులు ఎన్నికల సమయంలో కులం పేరు చెప్పి ఓట్లు అడిగేందుకు వస్తారని.. అలాంటి వారిని ప్రజలు నమ్మకూడదని ఆయన సూచించారు. కులం, మతం అనే తేడా లేకుండా తాను అందరినీ ఒకేలా చూస్తానని తెలిపారు. అర్హులకు ఇళ్లు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు తాను అందజేస్తానని చెప్పారు. ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. టిడిపి వస్తే ధరలన్నీ ఒక నియంత్రణలో ఉంటాయని భరోసా ఇచ్చారు. గత పదేళ్లుగా తాము అధికారంలో లేకపోయినా తమ టిజివి సంస్థల తరుపున సేవా కార్యక్రమాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నామన్నారు. అధికారంలో ఉంటే మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. తాను గెలిస్తే డిగ్రీలు, పీజీలు చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు లభించేలా పరిశ్రమలు తీసుకొస్తానని హమీ ఇచ్చారు. ప్రజలకు తాను మేలు చేయకపోతే 2029లో తనకు ఓటు వేయొద్దని భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత జగన్నాధం, 17వ వార్డు కార్పోరేటర్ పద్మలతా రెడ్డి, టిడిపి నేతలు బాబ్జీ, వినోద్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.