చైతన్యవంతమైన కళలుముఖ్య పాత్ర పోషిస్తాయి
1 min read– వై. వి. బి. రాజేంద్రప్రసాద్
పల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: ఆదర్శవంతమైన సమాజం- విశాల భావాల వ్యక్తిత్వానికి ప్రేరణ ఇచ్చేది అభ్యుదయ సాహిత్యమని మాజీ శాసనమండలి సభ్యులు, పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.అటువంటి సాహిత్యం, కళల ప్రోత్సాహంతో జన చైతన్యానికి కృషి చేస్తున్న బహుజన సాహిత్య అకాడమీ సేవలు ప్రశంసనీయమని ఆయన అన్నారు.బహుజన సాహిత్య అకాడమీ 3వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ మరియు నేషనల్ అవార్డ్స్ 2023 ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఉయ్యూరు లోని ఆయన కార్యాలయంలో గురువారం వైవిబి రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు.అనంతరం వైవిబి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వ్యక్తులలోని మానవీయతను సమాజం పట్ల బాధ్యతలను గుర్తు చేయటంలోనూ అభ్యుదయ సాహిత్యం చైతన్యవంతమైన కళలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. సేవా భావాల నుండి ఉత్తమసంస్కారం వరకు మంచి వ్యక్తిత్వానికి స్ఫూర్తినిచ్చే కళా – సాహిత్యం వైపు యువత దృష్టి సారించాలని రాజేంద్రప్రసాద్ సూచించారు. అభ్యుదయ సాహిత్యంతో పాటు సమాజ సేవకులు ప్రోత్సహించే కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న బి.ఎస్.ఏ. సంస్థ ఉయ్యూరులో తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బహుజన సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జంపాన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 14 సాయంత్రం 5 గంటలకు స్థానిక బైపాస్ రోడ్ అయ్యప్ప స్వామి గుడి సమీపంలోని గ్రీన్ ల్యాండ్ రిసార్ట్స్ ప్రాంగణంలో బి.ఎస్.ఏ. స్టేట్ కాన్ఫరెన్స్ తో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులను అవార్డులతో సత్కరించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి సగర సాధికార అధ్యక్షులు జంపన శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రాజులపాటి ఫణి, ఆకునూరు సర్పంచ్ గోలి వసంత కుమార్, తెదేపా నాయకుడు చలపాటి శ్రీను, బిఎస్ఏ ప్రతినిధులు ఖలీల్ రెహమాన్, నారగాని రజిని, కోలా దుర్గ భవాని తదితరులు పాల్గొన్నారు.