సార్వకాలిక సార్వజనీన శ్రేయోదాయకం శ్రీమద్రామాయణం
1 min read
కమలాపురం నందు ప్రారంభమైన తితిదే ధార్మికకార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: “యావత్ ప్రపంచంలో సార్వ కాలికమై, సార్వజనీనమై సర్వ జనులకు శ్రేయోమార్గాన్ని చూపించే అత్యుత్తమ గ్రంథం శ్రీమద్రామాయణం, ఆదర్శ పురుషుడు శ్రీ రామచంద్రుడు” అని తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మికోపన్యాసకులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రధానోపాధ్యాయులు డాక్టర్ తొగట సురేశ్ బాబు అన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో డోన్ మండలం కమలాపురం గ్రామంలోని శ్రీ రామాలయం నందు ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నేటి నుంచి ఐదు రోజులపాటు కమలాపురం గ్రామంలో శ్రీమద్రామాయణం, మహాభారతం భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు భజన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మొదటి రోజు ధార్మికోపన్యాసాలలో భాగంగా శ్రీ రామాయణం ప్రాముఖ్యత గురించి, లోకానికి ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన రామచంద్రమూర్తి వైభవాన్ని గురించి, భార్యాభర్తల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం, పితృవాక్య పరిపాలన, సత్య ధర్మ పరాక్రమశీలత్వం మొదలైన విషయాల గురించి డాక్టర్ సురేశ్ బాబు వివరించారు. ఈకార్యక్రమంలో భజన మండలి అధ్యక్షులు నర్లా శివరామిరెడ్డి, హార్మోనిష్టు బుగ్గన తిమ్మారెడ్డి, తబలిష్టు జయరాజు, భజన మండలి సభ్యులు ఎద్దుల భాస్కర్ రెడ్డి, కె.సి. రామిరెడ్డి, కె.పి. రామిరెడ్డి, ఎద్దుల గోవింద రెడ్డి, కె.శేఖర్, పి.వెంకట రాముడు, వై శ్రీనివాస రెడ్డి, యం. రామసుబ్బారెడ్డి, పి.గోపాల్ రెడ్డి, జి.సుంకన్నతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.