నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ పత్తికొండ: ఈ సంవత్సరం అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఐ బుధవారం స్థానిక ఆర్డీవోకు వ్యవసాయ అధికారులకు మెమోరాండం సమర్పించారు. అకాల వర్షాలు అధిక పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని ఈ పరిస్థితుల్లో పంట నష్టంపై పూర్తిస్థాయిలో అంచనాలు వేసి రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. పత్తి వేరుశనగ టమేటా కంది పంటలు వర్షాలు అధికమై దెబ్బతిని చేతికి అందలేదని అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులు తమను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి సురేంద్ర కుమార్ ఏపీ రైతు సంఘం నాయకులు పెద్ద వీరన్న మాట్లాడుతూ, రెవెన్యూ వ్యవసాయ అధికారులు తక్షణమే పంట నష్టంపై అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించాలన్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఎడతెరపి లేని వర్షాలకు అన్ని పంటలు దెబ్బతిని రైతాంగానికి కోలుకోలేని నష్టం ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే పంట నష్టం అంచనాలకు నివేదికలు తయారు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పంట నష్టం వివరాలను ఆర్డీవోకు రైతు సంఘం నాయకులు వివరించారు. ఈ మేరకు ఆర్డీవో స్పందించి పంట నష్టం అంచనాలను చేయడానికి సంబంధిత అధికారులను పురమాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏ ఐ కె ఎస్ నాయకులు సుంకన్న తదితరులు పాల్గొన్నారు.