పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యం: లోక్ సత్తా
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ: దేశంలో అందరికీ ఉచిత వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆనంద చారి. ఆదివారం లోక్ సత్తా పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో అందుకు సంబంధించిన అందరికీ వైద్యం ఆచరణ సాధ్యం నమూనా ప్రతులను విడుదల చేస్తూ, ఆయన విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించడం సాధ్యపడుతుందని, 85 వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో దేశ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించవచ్చని అభిప్రాయపడ్డారు. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ దేశమంతా పర్యటించి అందరికీ ఉచిత వైద్యం సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. 19 వందల కోట్లతో రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యం అందించవచ్చు అని అన్నారు. దేశ ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించే బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు డాక్టర్ జయప్రకాష్ నారాయణ రూపొందించిన అందరికీ ఆరోగ్యం ముసాయిదా సు మార్గం కాగలదని అభిప్రాయపడ్డారు. ఈ ముసాయిదాను దేశంలో అమలు చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్య భారతదేశం గా రూపొందుతుందని అన్నారు. అందుకనుగుణంగా లోక్ సత్తా పార్టీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా పార్టీ తాలూకా అధ్యక్షులు జయరాముడు నాయకులు మహమ్మద్ గౌస్, ఎర్రిస్వామి, ప్రసాదు, శ్రీనివాసులు, షరీఫ్ భాష శ్రీరాములు, లక్ష్మణస్వామి వర్ధన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.