ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలి
1 min read
ఎన్నికల హామీలన్నీ నెరవేర్చుతున్నాం…
కర్నూలుకు పరిశ్రమలు తీసుకొస్తాం..
రాష్ట్ర మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు : ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ముఖ్య సమావేశం నిర్వహించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై మంత్రి టి.జి భరత్ వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామన్నారు. ప్రజలకు మంచి చేయడం ఒక భాగమైతే.. చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం మరొక భాగమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలన్నారు. అధికారంలోకి వచ్చాక పింఛన్ పెంచి ఇచ్చామని, దేశంలో ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, అన్నా క్యాంటిన్ల ద్వారా రూ.5కే భోజనం పెడుతున్నామని, ఏడాదిలోనే తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. ఈ కంపెనీల వల్ల రాబోయే రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాను అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వార్డుల్లో 250కిపైగా విద్యుత్ పోల్స్ మార్చినట్లు చెప్పారు. ఒకదాని తర్వాత మరొక సమస్య పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేషన్ల డైరెక్టర్లు ముంతాజ్, సంజీవలక్ష్మి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
