PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

1 min read

– తెలుగుదేశం పార్టీ నాయకులు

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్లలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మిగనూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ బి వి జయనాగేశ్వర రెడ్డి పిలుపు మేరకు గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా తహసీల్దార్ (MRO)కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి,ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తగిన పరిహారం అందించాలని మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతు రాష్ట్రంలో గత పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రోజుల తరబడి కురుస్తున్న భారీ వర్షాలతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పంటలు నీటిలో నాని నష్ట తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ధాన్యంతో పాటు మిరప, మొక్కజొన్న, పసుపు, శనగ, వేరుశనగ, మామిడి, అరటి, ఇతర ఉద్యాన పంటలు బొప్పాయి, నిమ్మ, దానిమ్మ, బత్తాయి దెబ్బతిని రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు.వర్షాలతో పొలాల్లో నీరు నిలవడంతో ధాన్యాన్ని పొలం నుంచి రోడ్డుపైకి చేర్చేందుకు రైతులు అధికమొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.
పంట నష్టం అంచనా వేసి త్వరితగతిన పరిహారం అందించాలి.
అకాల వర్షాలకు దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.నాణ్యత కోల్పోయిన వివిధ పంటలను కూడా కొనుగోలు చేయాలి.నష్టపోయిన వరి, మొక్కజొన్న రైతుకు ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం అందజేయాలి.మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలి.రాయితీపై విత్తనాలు అందజేసి రైతులను ఆదుకోవాలి.పిడుగుపాటు గురై మరణించిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author