ఏపీ మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22న 45 ఏళ్లు నిండిన పేద మహిళలకు ఈ పథకం అమలు చేయనున్నారు. 22 నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఏటా రూ.18,750 జమ చేస్తోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం. అర్హుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం కూడా పూర్తైంది. కొత్తగా ఎవరైనా పేరు నమోదు చేసుకున్న వారిలో ఎవరైతే క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్, ఆధార్ తప్పనిసరిగా అందచేశారో వారి జాబితాలను మాత్రమే పరిశీలిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా 18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేస్తోంది.