గుండె స్పందించడమే..సాహిత్యం…!
1 min readడాక్టర్ జాగర్ల పుడి శ్యాం సుందర్ శాస్ర్తి
పల్లెవెలుగు:మనిషి సంతోషంలో ఉన్నా…దు:ఖంలో ఉన్నా కంటిలో నుంచి నీరు వస్తుందని, అది గుండె స్పందించడం ద్వారానే వస్తుందన్నారు ఆల్ ఇండియా రేడియో సీనియర్ అనౌన్సర్ డాక్టర్ జాగర్ల పుడి శ్యాం సుందర్ శాస్ర్తి. ఆదివారం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి, రిటైర్డు కార్డియాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో ‘సాహిత్యము–హృదయము’ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆల్ ఇండియా రేడియో సీనియర్ అనౌన్సర్ డాక్టర్ జాగర్ల పుడి శ్యాం సుందర్ శాస్ర్తి మాట్లాడుతూ మానవ శరీరంలో ప్రతి అవయవము స్పందిస్తుందని, కానీ గుండె స్పందించడమే మాత్రమే అందరికీ తెలుస్తుందన్నారు. ఒత్తిడికి గురైనా…రక్తసరఫరాలో మార్పు వచ్చినా గుండె కొట్టుకోవడం వేగం అవుతుందని, అలా గుండె స్పందించడమే సాహిత్యం అని స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో యువత … వ్యాయామం.. యోగా చేయకపోవడం…సెల్ఫోన్, కంప్యూటర్కే పరిమితం కావడంతో అనారోగ్యపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుండె ఉంటే బతుకుతారని, కానీ గుండె తడిగా ఉండాలంటే… అది సాహిత్యం ద్వారానే సాధ్యమన్నారు. సమాజంలో జరిగే ప్రతి ఘటనకు స్పందించే గుణం ఉండాలని, చెడు జరిగితే ప్రశ్నించాలని, మంచి జరిగితే ప్రోత్సహించే లక్షణం అలవర్చుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ జాగర్ల పుడి శ్యాం సుందర్ శాస్ర్తి పిలుపునిచ్చారు. అంతకు ముందు రిటైర్డు కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ.. పట్టుదల, ఏకాగ్రతతో లక్ష్యం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్ డా. శంకర్ శర్మ, హార్ట్ ఫౌండేషన్ సభ్యులు కల్కూర చంద్రశేఖర్,భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.