బయటకు వచ్చిన ‘ సిరా ’..!
1 min read– పోలింగ్ అధికారుల అత్యుత్సాహం
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: పోలింగ్ కేంద్రంలో ఉండాల్సిన సిరా పోలింగ్ అధికారుల అత్యుత్సాహం తో బయటకు వచ్చిన ఘటన నందికొట్కూరు మున్సిపాలిటీల్లో సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో చోటు చేసుకుంది. మున్సిపాలిటీ లోని 10వ వార్డుకు సోమవారం ఉప ఎన్నికలు జరిగాయి. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఓటు వేసేందుకు బంధువులతో కలిసి పోలింగ్ కేంద్రానికి ఆటోలో వచ్చాడు.
ఓటరు నడవలేని పరిస్థితి లో ఉన్నాడని, ఓటును బయట ఆటోలోనే తీసుకోవాలని అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఆదేశించడంతో పోలింగ్ అధికారులు ఎన్నికల సిరా ను, బ్యాలెట్ పత్రాలను, ఓటరు జాబితాను , స్వస్తిక్ ముద్ర ను తీసుకొని సిబ్బంది అందరూ హుటాహుటిన బయటకు వచ్చారు. మీడియా మిత్రులు ఫొటోలు తీయడానికి వెళ్ళితే .. ఫొటోలు తీయవద్దని వారించారు. విషయం తెలుసుకున్న పాములపాడు ఎస్ ఐ రాజ్ కుమార్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని పోలింగ్ సిబ్బందిని వారించి ఓటు హక్కును పోలింగ్ కేంద్రంలోనే వినియోగించుకోవాలని సూచించారు.
దీనితో పోలింగ్ కేంద్రం వద్ద అధికార పార్టీ నాయకుడు కొద్దిసేపు హల్చల్ సృష్టించాడు. పోలీసులు అతని హెచ్చరించి అక్కడి నుంచి పంపించారు. పోలింగ్ సిబ్బంది అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ పోలింగ్ బూత్ నుంచి బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనను ఉన్నతాధికారులకు పిర్యాదు చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.