అధ్యాపకుల పదోన్నతుల సమస్యను పరిష్కరించాలి
1 min read– ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి
పల్లెవెలుగు,వెబ్ అన్నమయ్య జిల్లా వీరబల్లి: జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదోన్నతుల సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. వీరబల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించి ఉపాధ్యాయుల సమస్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇన్చార్జిలతోనే కాలం గడుపుతున్నారన్నారు. కావున ఖాళీగా ఉన్న ఆర్ఐవో, డీవీఈవో, ఆర్ జేడీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు సిపిఎస్ రద్దు దిశగా అడుగులు వేస్తున్నాయని,ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కనుక తొలుత మన రాష్ట్రంలోనే సిపిఎస్ రద్దువుతుందని ఉద్యోగులు ఆశపెట్టుకున్నారని కావున ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసి పాత పింఛను పథకాన్ని తిరిగి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒడిశా తెలంగాణ రాష్ట్రాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంట్రాక్టు అధ్యాపకులకు కనీస వేతనం అమలు చేసి, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులు మంజూరు చేయాలన్నారు. భవిష్యత్తులో జరగబోయే అన్ని నియామకాలు కాంట్రాక్టు పార్ట్ టైం విధానాల్లో కాకుండా రెగ్యులర్ ప్రాతిపదికనే భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న జూనియర్ కళాశాలల్లో పాఠశాల సహాయకులకు జూనియర్ లెక్చరర్ల పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరికి పదోన్నతులు లేక ఎన్నో సంవత్సరాలు కావస్తున్నాయని కావున వీరికి జూనియర్ అధ్యాపకుల పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలన్నారు. ప్రతి ఉపాధ్యాయునికి పదోన్నతి దక్కాలంటే రాష్ట్రంలో ఏకీకృత సర్వీసు నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రస్తుతం న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికై ప్రభుత్వం ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపి సర్వీసు నిబంధనలను అమలు చేయాలన్నారు. ఆదర్శ పాఠశాలల సిబ్బందికి 010 పద్దు కింద వేతనాలు అందిస్తూ ఆదర్శ పాఠశాలలను ప్రభుత్వంలోనికి విలీనం చేయాలని కోరారు. కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయినుల సమస్యలను పరిష్కరించి వారికి కనీస వేతనం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రఘురామయ్య, అధ్యాపకులు శ్యాంసుందర్, ఒప్పంద అధ్యాపకులు రాజు, హరి, రమేష్, వైట్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ గజ్జల వేమనారాయణరెడ్డి, వెంకట్రామిరెడ్డి, జనార్ధన్, రామ్మోహన్, భాస్కర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.