జ్యోతిరావు పూలే జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జ్యోతిరావు పూలే జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ మాధవరం ప్రకాశం, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గాదే రోశన్న పిలుపునిచ్చారు. సంఘసంస్కర్త సామాజిక తత్వవేత్త సమసమాజ స్థాపనకై అహర్నిశలు కృషిచేసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మంగళవారం జూపాడుబంగ్లా మండలం పారుమంచాల జడ్పీ పాఠశాలలో ప్రధానో పాధ్యాయులు లక్ష్మన్న ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా సర్పంచు ప్రకాశం హాజరయ్యారు. పూలే చిత్రపటానికి అతిథులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న జన్మించాడన్నారు. జ్యోతిరావు ఫూలే సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి అతని భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడన్నారు. జ్యోతిరావు పూలే బాలికల కోసం పాఠశాల స్థాపించి తన భార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేవాడని తెలిపారు. వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజలలో చెైతన్యం తీసుకువచ్చాడని, స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడని, వితంతువులెైన గర్భిణీ స్ర్తీల కొరకు “బాలహత్య ప్రధిబంధక్ గృహ” స్థాపించారన్నారు. కుల విధానాలను భూస్వామ్య పెత్తందారీ వర్గాలను వ్యతిరేకించాడన్నారు. రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు ‘దీనబంధు’ వార పత్రిక ప్రారంభించాడని, బానిసత్వం గురించి వివరిస్తూ ‘గులాంగిరి’ అను పుస్తకం ప్రచురించాడన్నారు. సంఘసంస్కర్త సామాజిక తత్వవేత్త సమసమాజ స్థాపన కై అహర్నిశలు కృషిచేసి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా జ్యోతిరావు తన గురువు అని డా బి.ఆర్. అంబేడ్కర్ ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జ్యోతిరావు పూలే గారి జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆ మహనీయుని అడుగుజాడలలో నడిచి సమ సమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.