నిత్యచైతన్య దీప్తులు మన ఇతిహాసాలు
1 min read– డాక్టర్ మల్లు వేంకటరెడ్డి
పల్లెవెలుగు వెబ్ కోడుమూరు: మన మహర్షులు మనకందించిన పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు నిత్య చైతన్య దీప్తులని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా, కోడుమూరు మండలం, ప్యాలకుర్తి గ్రామంలోని శ్రీభీమలింగేశ్వర స్వామి ఆలయం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ముగింపు సందర్భంగా గోపూజ కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయులు తమతమ జీవన విధానంతో సమాజానికి ఆదర్శ బాటలు వేశారని, వారు చూపిన మార్గం యావత్ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. గత మూడు రోజులుగా శ్రీమద్రాయణం మహాభారతం భగవద్గీతలపై బి.ఉసేనయ్య చేసిన ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శివదీక్ష గురువు గెరిబోని హనుమంతు, అధ్యాపకులు మల్లు వేంకట రామిరెడ్డి, వెంగోటి రంగన్న, రేపల్లె గోవిందు, మధుతో పాటు పెద్ద సంఖ్యలో శివదీక్షా స్వాములు, భక్తులు పాల్గొన్నారు.