PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

1 min read

జిల్లాలో 3,39,680 స్వయం సహాయక సంఘాలు

  • రుణాలు తీసుకుని.. సద్వినియోగం చేసుకోండి…
  • బ్యాంకులకు తిరిగి చెల్లిస్తే… కొత్త రుణం త్వరగా తీసుకోవచ్చు…
  • సేవింగ్​ అకౌంట్​లో రూ.147 కోట్లు
  • జీవనోపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయం…
  • కర్నూలు డీఆర్​డీఏ పీడీ ఎన్​.సలీంబాష

పల్లెవెలుగు:మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందజేస్తుందన్నారు కర్నూలు డీఆర్​డీఏ పీడీ ఎన్​.సలీంబాష. గ్రామీణ మహిళలకు గ్రామైక్య సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించి.. వారికి జీవనోపాధి పెంపొందించడమే కాకుండా ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సోమవారం ఆయన ఛాంబరులో ‘ పల్లెవెలుగు ప్రతినిధి’తో మాట్లాడారు. మహిళలకు కిరాణ షాపు, కుట్టుమిషన్లు,  బట్టల వ్యాపారం, పాలు, పెరుగు దుకాణం తదితర చిరువ్యాపారాలతో ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తోందన్నారు. కర్నూలు జిల్లాలోని అన్ని మండలాల్లో (గ్రామీణం) మొత్తం 3,39,680 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, అందులో 949 గ్రామ ఐక్య సంఘాలు కాగా 32,558 స్వయం సహాయక సంఘాలు, 25 మండల మహిళా సమైక్య సంఘాలు ఉన్నాయని వివరించారు.

గ్రామైక్య సంఘాలకు…గుర్తింపు…

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు రుణ సౌకర్యం కల్పించడం… జీవనోపాధి పెంపొందించడంలో గ్రామైక్య సంఘాల పాత్ర కీలకమైనది. మహిళలను సంఘాలలో చేర్చడం… పొదుపు గ్రూపులలో రుణాలు ఇప్పించి… తిరిగి చెల్లించేలా చేయడం, బుక్​ మెయింటెనెన్స్​ తదితర పనులు చేసిన గ్రామైక్య సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తింపునిచ్చింది. జిల్లాలో దాదాపు 25వేల గ్రామైక్య సంఘాలకు ‘ఏ’ గ్రేడ్​ గుర్తింపునివ్వగా…. 6964 సంఘాలు ‘బి’ గ్రేడ్​, 642 గ్రామైక్య సంఘాలు ‘సీ’ గ్రేడ్​లో ఉన్నట్లు డీఆర్​డీఏ పీడీ ఎన్​.సలీంబాష వెల్లడించారు.

సంఘనిధితో… రెట్టింపు ప్రోత్సాహం…

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రుణాలు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. రుణాలు తీసుకొని..తిరిగి చెల్లించడం వల్ల త్వరగా మళ్లీ రుణం పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో అన్ని  గ్రామైక్య సంఘాలకు సంబంధించి  (సంఘనిధి) రూ.147 కోట్లు ఉంది. ఈ నిధి ద్వారా మహిళలకు అంతర్గత అప్పులు ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఇందుకు గ్రామైక్య సంఘంలో  ప్రెసిడెంట్​, కార్యదర్శి, ట్రెజరర్​, వీఓ, సీసీ, గ్రూపు సభ్యుల ఆమోదంతో సేవింగ్​ అమౌంట్​లో రుణం తీసుకోవచ్చు. బ్యాంకు రుణాలు కాదని… స్వయం సహాయక పొదుపులో నుంచి కూడా రుణ సౌకర్యం పొందే అవకాశం ఉంది. అయితే ప్రతి పైసా సద్వినియోగం చేసుకొని.. తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

రుణాలు చెల్లించని గ్రూపులు ఇవే…

జిల్లాలో రుణాలు తీసుకొని..తిరిగి బ్యాంకులకు చెల్లించని గ్రామైక్య సంఘాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని, కానీ చెల్లించడం లేదు. అలాంటివి జిల్లాలో చాలా ఉన్నాయి. మంత్రాలయం 103 గ్రామైక్య సంఘాల, కృష్ణగిరి 92, ఆదోని 107, తుగ్గలి 75, కల్లూరు 52, దేవనకొండ 78, కౌతాళం 61, కోసిగి 55, గోనెగండ్ల 38, పత్తికొండ 38, గూడురు 35, కర్నూలులో 78 గ్రామైక్య సంఘాలు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించ లేదు.  తీసుకున్న అప్పు చెల్లిస్తే… కొత్త సభ్యులకు రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.

8వ విడత… జగనన్న తోడు…

చిరు వ్యాపారులను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా చిరు వ్యాపారులకు రూ.10వేలు రుణ సౌకర్యం కల్పిస్తోంది. 8వ విడతలో భాగంగా జిల్లాలో  దాదాపు 11,999 మంది లబ్ధి పొందనున్నారు.

ఉన్నత మహిళా శక్తి…

జిల్లాలోని ఎస్సీ ఎస్టీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ‘ ఉన్నత మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక పథకం అమలు చేయనున్నంది. పథకంలో భాగంగా మండలానికి (ఇద్దరికి) రెండు ఆటోలు ఇవ్వనుంది. డిసెంబరు 6వ తేదీన ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్నది. ఇందుకు ఆసక్తి ఉన్న మహిళలు ఎల్​ఎల్​ ఆర్​ లేదా డ్రైవింగ్​ లైసెన్స్​ తదితర గుర్తింపు కార్డులు అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో 9 మంది దరఖాస్తు చేసుకోగా ఏడుగురి మహిళలకు శిక్షణ కూడా పూర్తి చేశారు.  అన్ని మండలాల నుంచి  దరఖాస్తులు తీసుకుంటాం. ఆసక్తి గల వారు ముందుకు రావాలని డీఆర్​డీఏ పీడీ  ఎన్​.సలీంబాష కోరారు.

About Author