పగ.. కాటేసింది..!
1 min readపాత కక్షలే.. హత్యకు దారి తీశాయి..
– .. మునగాల కేసులో ఐదుగురి అరెస్ట్
– వివరాలు వెల్లడించిన కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్
పల్లెవెలుగువెబ్, గూడూరు: నిద్రిస్తున్న వ్యక్తిని పిలుచుకు వెళ్లి.. హత్య చేసిన ఘటన… రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఐదు రోజుల క్రితం గూడురు పోలీస్ స్టేషన్ పరిధి.. మునగాల గ్రామంలో ఇంటిలో నిద్రిస్తున్న అనకాల దస్తగిరిని …బయటకు పిలుచుకు వెళ్లి హత్య చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు అయ్యారు. శుక్రవారం గూడురు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేవీ మహేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మునగాల గ్రామానికి చెందిన బోయ దస్తగిరిని అదే గ్రామానికిచెందిన బోయ గడ్డం రామాంజనేయులు, బోయ కోటకొండ ఏసు నాయుడు, బోయ కోటకొండ హనుమంతు, బోయ చిన్న గోపాల్ అలియాస్ కుంటి చేయిగోపాల్, బోయ రాముడు ఈనెల 21న రాత్రి 9:30సమయంలో దస్తగిరిని వేటకొడవళ్లతో అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు.
పాతకక్షలకు… రాజకీయం తోడు
మృతుడు బోయ అనకాల దస్తగిరికి.. ఐదుగురి ముద్దాయిలకు గత 20 ఏళ్ల నుంచి పాత కక్షలు ఉండేవి. దీనికి తోడు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముద్దాయి బోయకోటకొండ ఏసు నాయుడు టిడిపి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయగా బోయ అనకాల దస్తగిరి ముద్దాయిలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి.. ఓడిపోవడానికి కారణం అయ్యాడనే కక్షతో కిరాతకంగా కొడవళ్లతో హతమార్చినట్లు కేసు విచారణలో తెలిసింది. హత్య కేసులో కోడుమూరు సీఐ శ్రీధర్, ఎస్సై నాగార్జున, ప్రొబేషనరీ ఎస్ఐ మమత చాకచక్యంగా వ్యవహరించి శుక్రవారం మునగాల గ్రామంలోని మారమ్మ గుడి దగ్గర ముద్దాయిలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ కేవీ మహేష్ వెల్లడించారు.