అధికారం ఉన్న వారితో అంటకాగితే పోలీసులుకు ఇబ్బంది తప్పదు !
1 min readపల్లెవెలుగువెబ్ : అవినీతి, అత్యుత్సాహం, రాజకీయ వర్గాలతో చేతులు కలపడం… ఇలాంటి ఆరోపణలతో పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ మసకబారుతోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ‘అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు మారిపోతారు. కానీ… మీరు శాశ్వతంగా ఉంటారు’ అని పోలీసులు, సీబీఐ అధికారులను ఉద్దేశించి అన్నారు. శుక్రవారం ఆయన సీబీఐ తొలి డైరెక్టర్ డీపీ కోహ్లి స్మారకోపన్యాసం చేశారు. ‘‘ప్రభుత్వం మారగానే తమను వేధిస్తున్నారని చాలామంది పోలీసు అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అధికారంలో ఉన్న వారితో అంటకాగినప్పుడు ఆ తర్వాత పర్యవసానాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే… సత్వరం రాజకీయ నాయకులతో అవాంఛనీయ బంధాన్ని తెంచుకోవాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.