డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి…
1 min readడప్పే ఆయుధంగా ఉద్యమిస్తాం
ఏపీ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు
డప్పు కళాకారుల పెన్షన్ నమోదులో ఆటంకాలను తొలగించాలి:జిల్లా ప్రధాన కార్యదర్శి బి కరుణాకర్.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించకపోతే డప్పే ఆయుధంగా ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు స్పష్టం చేశారు.గురువారం నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గిత్తరి రమేష్ బాబు ఆధ్వర్యంలో డప్పు కళాకారుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్ లు మాట్లాడుతూ, భారతదేశ సమాజ పునరుజ్జీవనంలో అత్యంత పురాతన కళ, సాంప్రదాయ కళ డప్పు కళ. సమాజ జాగృతికి, సమాచారం చేరవేతకు నేటికీ ఉపయోగపడుతున్న కళ డప్పు కళ, చావైనా… దేవరైనా… పండగ అయినా… ఊరేగింపైన డప్పు మోగందే అడుగు ముందుకు పడదని పేర్కొన్నారు. అలాంటి అత్యున్నతమైన కళను వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్న దళితుల బ్రతుకులు మాత్రం వెనుకంజలోనే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల పట్ల, దళిత వృత్తుల పట్ల అణిచివేత కొనసాగుతూనే వస్తోందని అన్నారు. 2006 లో KVPS కు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యమించిన ఫలితంగా 2013 లో డప్పు కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులను, 2019లో రూ,,3000/- లు పెన్షన్ ను, జీ ఓ నెం: 108 ద్వారా డప్పు, గజ్జలు, డ్రస్స్ ను సాధించుకున్నామని తెలిపారు. అందరికి పెన్షన్ లు పెంచుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారులకు మాత్రం పెన్షన్ పెంచడం లేదని ఆవేదన చెందారు. డప్పు గజ్జలు డ్రస్ ను సైతం కేవలం 2019లో పెన్షన్ వచ్చిన వారికి మాత్రమే ఇచ్చింది తప్ప నిరక్షరాశ్యులయిన డప్పు కళాకారులను డిజిటల్ సర్టిఫికేట్ పేరుతో పెన్షన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అలాగే విజయవాడలో 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ప్రభుత్వం దళితులకు వర్తించిన దాదాపు 27 ప్రభుత్వ సంక్షేమ పథకాలను దళితులకు దూరం చేసిందని ఎద్దేవ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారుల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, డప్పు, చర్మ కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, డప్పు కళాకారుల పెన్షన్ వయసు 45సంవత్సరాలకు తగ్గించాలని, డప్పు కొడుతున్న ప్రతి డప్పు కళాకారునికి ప్రభుత్వమే ఉచితంగా డప్పు, గజ్జలు, డ్రెస్సు, చర్మకారులకు 20000/- విలువ చేసే కిట్లు పంపిణీ చేయాలని, RTC, రైల్వే ప్రయాణాల్లో రాయితీ కల్పించాలని, డప్పు కళాకారులకు పత్తికొండలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ప్రభుత్వమే పక్క ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే భూమిలేని డప్పు, చర్మ కళాకారులకు రెండు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని, ఇప్పటికే తీసివేసిన దళితుల అన్ని రకాల పథకాలను పునరుద్ధరించాలని వారు
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డిఓ రామలక్ష్మి గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆస్పరి, మద్దికేర, తుగ్గలి, పత్తికొండ మండలాల డప్పు కళాకారులు పరశురాముడు, పెద్దయ్య, కడివెళ్ల పెద్దయ్య, నరసింహులు, ఉల్లన్న, సూర్యనారాయణ, దుడమన్న, మహానంది, వెంకటేష్, పులి, జట్కా రామాంజినేయులు, మస్తాన్ రంగస్వామి మరియు చర్మకారులు మారెప్ప, నాగరాజు, కారప్ప తదితరులు పాల్గొన్నారు.